Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ లో 2 వేల అశ్లీల ఫొటోలు, 40 వీడియోలు!

- ప్రజ్వల్ అశ్లీల వీడియోల గురించి తల్లి భవానికి తెలుసన్న డ్రైవర్
- కొడుకు వ్యవహారం తెలిసి భవాని ఆవేదన చెందారని వాంగ్మూలం
- ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని డ్రైవర్‌ను కోరిన భవాని
- తర్వాత ప్రజ్వల్ తనను నిలదీశాడని చెప్పిన డ్రైవర్ కార్తీక్
కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణ కారు డ్రైవర్ ఎన్. కార్తీక్ సోమవారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ముందు హాజరై సంచలన విషయాలు వెల్లడించారు. ప్రజ్వల్ మహిళలతో సన్నిహితంగా ఉన్న క్షణాలను వీడియో తీసే అలవాటు గురించి ఆయన తల్లి భవానీ రేవణ్ణకు ముందే తెలుసని కార్తీక్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
హోళెనరసీపుర తాలూకా కడవినకోట్టె గ్రామానికి చెందిన 34 ఏళ్ల కార్తీక్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ విచారణ సందర్భంగా ఈ వివరాలు తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ హసన్ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన మొబైల్ ఫోన్‌లో 2,000కు పైగా అశ్లీల చిత్రాలు, సుమారు 40 వీడియోలు ఉన్నాయని కార్తీక్ కోర్టుకు వివరించారు. ఈ విషయాన్ని తాను ప్రజ్వల్ తల్లి భవాని దృష్టికి తీసుకెళ్లానని, మొదట ఆమె నమ్మలేదని చెప్పారు.
అయితే, తాను ఫోటోలు, వీడియోలు చూపించిన తర్వాత, భవాని వాటిని తనకు పంపమని కోరారని, కొడుకు ప్రవర్తన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని కార్తీక్ తెలిపారు. ఈ సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దని కూడా ఆమె తనను కోరినట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత భవాని, ప్రజ్వల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, అయితే ఈ సమాచారం ఎవరు బయటపెట్టారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రజ్వల్ దాదాపు రెండు నెలల పాటు తల్లితో మాట్లాడలేదని కార్తీక్ వివరించారు.
చివరకు, భవాని తన (కార్తీక్) పేరు చెప్పడంతో, ప్రజ్వల్ తనను పిలిచి గట్టిగా మందలించాడని కార్తీక్ కోర్టుకు తెలిపారు. ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఎలా బయటకు వచ్చాయనే విషయంపై కార్తీక్ మాట్లాడుతూ, "ఒకరోజు ప్రజ్వల్ తన మొబైల్ ఫోన్‌ను కారులోనే వదిలేసి జయనగర్‌లోని అశోకా పిల్లర్ సమీపంలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లారు. నాకు పాస్‌వర్డ్ తెలియడంతో, కుతూహలంతో ఆయన ఫోన్ పరిశీలించాను. అందులో పార్టీ కార్యకర్తలు, ఇంట్లో పనిచేసేవారితో పాటు మరికొందరి వీడియోలు కనిపించాయి. వెంటనే ఆ ఫోటోలు, వీడియోలను నా మొబైల్‌కు బదిలీ చేసుకున్నాను" అని వివరించారు. ఈ వాంగ్మూలం కేసులో మరింత కీలకంగా మారింది.