పంత్‌కు రూ. 30ల‌క్ష‌ల ఫైన్‌.. కార‌ణమిదే..!

  • ల‌క్నో జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా పంత్‌కు భారీ జ‌రిమానా
  • ఈ సీజ‌న్‌లో నియ‌మావ‌ళిని మూడోసారి ఉల్లంఘించిన ఎల్ఎస్‌జీ
  • ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ల‌క్నో ప్లేయ‌ర్లు అంద‌రికీ రూ. 12 ల‌క్ష‌ల చొప్పున‌ ఫైన్‌
మంగ‌ళ‌వారం రాత్రి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు రూ. 30 ల‌క్ష‌ల ఫైన్ ప‌డింది. ల‌క్నో జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేట్‌తో బౌలింగ్ చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ నేప‌థ్యంలో ల‌క్నో జట్టుకు బీసీసీఐ జ‌రిమానా వేసింది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ల‌క్నో ప్లేయ‌ర్లు అంద‌రికీ రూ. 12 ల‌క్ష‌ల చొప్పున‌ జ‌రిమానా విధించింది. 

ఈ సీజ‌న్‌లో నియ‌మావ‌ళిని మూడోసారి ల‌క్నో జ‌ట్టు ఉల్లంఘించిన‌ట్లు ఐపీఎల్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అందుకే జ‌ట్టు కెప్టెన్ అయిన‌ పంత్‌కు రూ. 30 ల‌క్ష‌లు ఫైన్ వేసిన‌ట్లు చెప్పింది. ల‌క్నో జ‌ట్టులోని మిగతా ఆట‌గాళ్ల‌కు రూ. 12 లక్ష‌లు లేదా 50 శాతం ఫీజులో కోత విధించ‌నున్నారు.

కాగా, నిన్న‌టి హై స్కోరింగ్ మ్యాచ్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు ఆరు వికెట్ల తేడాతో ల‌క్నోపై ఘ‌న‌ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కానీ, ఆర్‌సీబీ ఈ భారీ ల‌క్ష్యాన్ని నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి, మ‌రో ఎనిమిది బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించింది. 

ఎల్ఎస్‌జీ సార‌థి రిష‌బ్ పంత్ అజేయ శ‌త‌కం చేసినా త‌మ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు 61 బంతుల్లో 118 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ ఆర్సీబీ కెప్టెన్ జితేశ్ శర్మ 85 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో లక్నో జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. ఈ సీజ‌న్‌ను ల‌క్నో పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంతో ముగించింది. 14 మ్యాచులాడిన ఆ జ‌ట్టు 6 విజ‌యాలు మాత్ర‌మే న‌మోదు చేసింది. మ‌రోవైపు ఆర్‌సీబీ ఈ గెలుపుతో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి దూసుకెళ్లి, క్వాలిఫ‌య‌ర్-1కు అర్హ‌త సాధించింది. గురువారం చండీఘ‌డ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది.  


More Telugu News