Pawan Kalyan: ఎన్టీఆర్ కు ఘన నీరాజనం అర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

- ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళి
- తెలుగు సంస్కృతి, సినిమా, సామాజిక సేవల్లో ఎన్టీఆర్ ది చెరగని ముద్ర అని కితాబు
- ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడిగా ఎన్టీఆర్‌ను అభివర్ణించిన పవన్ కల్యాణ్, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
"తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నీరాజనం. ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామర నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారు.
"సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు" అనే అక్షర సత్య ఆలోచన, రాజకీయాల పట్ల ఎన్టీఆర్ గారి దృక్కోణాన్ని తెలియచేస్తుంది. రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా, విద్యావకాశాల విస్తరణలో భాగంగా ఎంసెట్ ప్రవేశ పరీక్షను ప్రారంభించడం, ఈ రోజు మహానాడు జరిగే కడప ప్రాంతానికి నీళ్లు అందించే తెలుగుగంగ ప్రాజెక్ట్ వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం కాన్సర్ ఆసుపత్రి ప్రజా సేవలో ఆయన విజన్‌ను ఈ రోజుకీ కొనసాగిస్తోంది. ఈ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి ఆదర్శాలను స్మరించుకుంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సమైక్యతను కాపాడుకుంటూ, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి అని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.