Kasi Reddy: లిక్కర్ స్కామ్... జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డిని విచారిస్తున్న ఈడీ అధికారులు

Liquor Scam ED Interrogates Key Accused Kasi Reddy

  • లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ
  • డబ్బు ఎలా మళ్లించారు, ఎవరెవరికి చేరిందనే కోణంలో దర్యాప్తు
  • సిట్ అధికారులతో నిన్న ఈడీ అధికారుల భేటీ

మద్యం కుంభకోణం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమ దర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి)ని విచారించేందుకు ఈ ఉదయం ఈడీ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. రాజశేఖర్ రెడ్డి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పొందారు.

మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్మును ఎలా దారి మళ్లించారు, ఈ నగదు ఎవరెవరి చేతులు మారింది, ఎప్పుడెప్పుడు ఈ లావాదేవీలు జరిగాయి అనే అంశాలపై ఈడీ అధికారులు రాజ్ కసిరెడ్డిని ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ఈడీ బృందం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులతో సమావేశమైంది. కేసు పూర్వాపరాలను సిట్ అధికారులు ఈడీకి వివరించారు. ఇకపై ఈ కేసు విచారణలో పరస్పరం సహకరించుకోవాలని ఇరు దర్యాప్తు సంస్థలు నిర్ణయించుకున్నాయి.

మద్యం కుంభకోణంలో ఏ-1 నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో పాటు ఇతర నిందితులు, మద్యం వ్యాపారులు, కొందరు మాజీ అధికారులు సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా, ఈ అక్రమ లావాదేవీల ద్వారా వచ్చిన ముడుపులు చివరకు ఎవరికి చేరాయనే విషయంపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంచనాలను బలపరిచేందుకు పక్కా ఆధారాలను సేకరించాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. 

రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న క్యాష్ హ్యాండ్లర్ల ద్వారా వసూలైన డబ్బు ఎన్ని దశలు దాటి, ఎవరికి చేరిందనే విషయంపై ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురు కీలక వ్యక్తుల విచారణలో మరిన్ని వివరాలు బయటపడినట్లు సమాచారం. గత ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా చక్రం తిప్పారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. సిట్ సేకరించిన ఈ వివరాల ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ముందుకు తీసుకెళ్లనుంది.

Kasi Reddy
Liquor Scam
Andhra Pradesh
ED Investigation
Enforcement Directorate
Excise Policy
Jagan Mohan Reddy
SIT Investigation
Dhanunjaya Reddy
Krishna Mohan Reddy
  • Loading...

More Telugu News