Nadendla Manohar: ప్రపంచ ప్రామాణికంగా భారత స్టాండర్డ్స్: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar Says Indian Standards Becoming Global Norms
  • ఢిల్లీలో బీఐఎస్ పాలక మండలి సమావేశం
  • హాజరైన ఏపీ మంత్రి నాదెండ్ల
  • భారతీయ ప్రమాణాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని హర్షం
భారతదేశంలో అమలవుతున్న ప్రమాణాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రామాణికంగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశంలో నాణ్యత పరిరక్షణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జరిగిన బీఐఎస్ 9వ పాలక మండలి సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో బీఐఎస్ అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. 2014-15 సంవత్సరంలో భారతదేశంలో కేవలం 2,000 ప్రమాణాలు మాత్రమే ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 23,000లకు చేరిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో ఈ ప్రమాణాల సంఖ్యను 55,000 వరకు పెంచడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

భారత్ రూపొందించిన ప్రమాణాలలో 95 శాతం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమన్వయం (హార్మొనైజ్డ్) చేయబడ్డాయని, దీంతో భారత స్టాండర్డ్‌లు ఇప్పుడు ప్రపంచ ప్రామాణికంగా మారుతున్నాయని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. బంగారం హాల్‌మార్కింగ్ విషయంలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఇప్పటివరకు దేశంలోని 371 జిల్లాల్లో బంగారం హాల్‌మార్కింగ్ విధానం అమలులో ఉందని, దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ హాల్‌మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.

త్వరలోనే బులియన్ (బంగారు కడ్డీలు) హాల్‌మార్కింగ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అదేవిధంగా, వెండి ఆభరణాల హాల్‌మార్కింగ్‌కు సంబంధించి విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, దీనిపై కూడా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేస్తుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. భారతదేశంలో ప్రమాణాల పరిరక్షణ, నాణ్యత నియంత్రణ, వినియోగదారుల న్యాయ హక్కుల పరిరక్షణలో బీఐఎస్ పోషిస్తున్న పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Nadendla Manohar
Andhra Pradesh
Bureau of Indian Standards
BIS
Gold Hallmarking
Prahlad Joshi
Quality Standards India
Consumer Rights
Indian Standards

More Telugu News