ఆఫీస్ వర్చువల్ మీటింగ్‌లో కుకీస్ తింటూ దొరికిపోయిన యువతి... మేనేజర్ ఫన్నీ వార్నింగ్!

  • ఫుణె ఉద్యోగినికి వర్క్ కాల్‌లో ఎదురైన సరదా సంఘటన
  • మీటింగ్‌లో కుకీస్ తింటుండగా మైక్‌లో శబ్దం
  • బిస్కెట్లు తింటున్న శబ్ధం వస్తుంది.. మ్యూట్ చేయండన్న మేనేజర్
  • యువతి ఎక్స్‌లో పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్ వైరల్
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిన తర్వాత ఆన్‌లైన్ మీటింగ్‌లు సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకోకుండా జరిగే సరదా సంఘటనలు సామాజిక మాధ్యమాలలో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా పుణెకు చెందిన ఒక ఉద్యోగికి వర్చువల్ మీటింగ్‌లో ఎదురైన ఇలాంటి ఓ సరదా అనుభవం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సమావేశంలో ఉండగానే తనకు ఇష్టమైన కుకీస్‌‍‌ తింటున్న ఆమెకు మేనేజర్ నుంచి వచ్చిన ఒక ఫన్నీ మెసేజ్ అందరినీ నవ్విస్తోంది.

పుణెకు చెందిన ధీమహి జైన్ అనే యువతి ఆన్‌లైన్ ఆఫీస్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె తనకు ఇష్టమైన కుకీస్‌ను తింటున్నారు. మైక్రోఫోన్ ఆన్‌లో ఉన్న విషయం ఆమె గమనించలేదు. కుకీస్ నములుతున్నప్పుడు వచ్చే శబ్దం పెద్దగా వినిపించదనే అనుకున్నారు. కానీ, ఆమె మేనేజర్ ఆ శబ్దాన్ని స్పష్టంగా విన్నారు.

వెంటనే ధీమహికి ఆమె మేనేజర్ నుంచి ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అందులో, "ధీమహి, దయచేసి మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి, బిస్కెట్లు తింటున్న శబ్దాలు వస్తున్నాయి" అని సరదాగా హెచ్చరించారు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ధీమహి జైన్ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.

"ఈరోజు నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. వర్క్ కాల్‌లో నా ఫేవరెట్ కుకీస్ తింటున్న సమయంలో, శబ్దం ఏం వస్తుందిలే అనుకున్నాను. కానీ తింటున్న శబ్దం వినపడటంతో నా మేనేజర్ ఇలా స్పందించారు" అంటూ ఆమె ఆ పోస్ట్‌కు వ్యాఖ్యను జతచేశారు.

ధీమహి పోస్ట్ చేసిన కొద్దిసేపటికి ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు ఈ సరదా సన్నివేశానికి తమదైన శైలిలో స్పందించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను, ఫన్నీ మీమ్స్‌ను పంచుకున్నారు.


More Telugu News