Shandong Yudao Chemical: చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు.. దట్టంగా అలుముకున్న పొగ

Shandong Yudao Chemical Plant Explosion in China
  • చైనాలోని షాన్‌డాంగ్‌ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు
  • ఆకాశంలో వందల అడుగుల ఎత్తుకు ఎగసిన దట్టమైన పొగ
  • కిలోమీటర్ల దూరంలోని ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసం
  • 232 మంది అగ్నిమాపక సిబ్బందితో సహాయక చర్యలు
చైనాలోని తూర్పు ప్రావిన్సు షాన్‌డాంగ్‌లోని ఒక రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయిందని, ఆకాశంలో వందల అడుగుల ఎత్తు వరకు పొగ వ్యాపించిందని అధికారిక మీడియా వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి.

షాన్‌డాంగ్‌ ప్రావిన్సు పరిధిలోని వీఫాంగ్‌ నగర శివార్లలో ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్కులోని షాన్‌డాంగ్‌ యుడావో కెమికల్ పరిశ్రమలో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ప్రమాద తీవ్రత దృష్ట్యా, చైనా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. సుమారు 232 మంది అగ్నిమాపక సిబ్బందిని, పలు ప్రత్యేక రెస్క్యూ బృందాలను, వైద్య నిపుణులను ఘటనా స్థలానికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ షాన్‌డాంగ్‌ యుడావో రసాయన పరిశ్రమలో దాదాపు 500 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. అయితే, ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Shandong Yudao Chemical
China chemical explosion
Shandong explosion
Weifang industrial park

More Telugu News