Vidadala Rajini: పిన్నెల్లి సోదరులపై కేసు... పోలీసులపై విడదల రజని ఫైర్

Vidadala Rajini Alleges Political Conspiracy in Pinnelli Case
  • మాచర్ల హత్య కేసులో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించారన్న రజని 
  • హత్యకు గురైనవారు, నిందితులు ఇద్దరూ టీడీపీ వారేనని ఎస్పీ చెప్పారని గుర్తు చేసిన రజని
  • రాజకీయ ఒత్తిళ్లతోనే పిన్నెల్లి సోదరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని విమర్శ
  • ఎఫ్ఐఆర్ నుంచి పిన్నెల్లి సోదరుల పేర్లను తక్షణమే తొలగించాలని వైసీపీ డిమాండ్
మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను అన్యాయంగా ఇరికించారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ, పల్నాడు జిల్లా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు.

విడదల రజని మాట్లాడుతూ, "మాచర్ల ఘటనలో హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వారు ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారేనని ఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ స్వయంగా ప్రాథమిక విచారణ అనంతరం వెల్లడించారు. మృతుడికి, తోట చంద్రయ్య కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే, రాజకీయ జోక్యం తర్వాత పిన్నెల్లి సోదరుల పేర్లను ఈ కేసులో చేర్చడం దారుణం" అని అన్నారు. ఇది టీడీపీలోని ఆధిపత్య పోరులో భాగమేనని, దానికి పిన్నెల్లి సోదరులకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తెలిపారు.

"మొదట మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఇది రాజకీయ కక్షల వల్ల, టీడీపీలోని అంతర్గత గొడవల వల్లే జరిగిందని చెప్పారు. కానీ, ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత పరిస్థితి మారింది. రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసును పిన్నెల్లి సోదరులకు అంటగట్టారు. ఇది రెడ్ బుక్ పాలనకు పరాకాష్ఠ కాదా?" అని రజని ప్రశ్నించారు. తక్షణమే ఎఫ్ఐఆర్ నుంచి పిన్నెల్లి సోదరుల పేర్లను తొలగించాలని వైసీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.

పోలీసుల తీరును తప్పుబడుతూ, "పోలీసులంటే మాకు గౌరవం ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ కాస్తా, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్‌గా మారిందనిపిస్తోంది. పోలీసులు తమ యూనిఫాంకు ఉన్న విలువను కాపాడుకోవాలి. పల్నాడు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. గురజాలలో హరికృష్ణ అనే బీసీ యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నరసరావుపేటలో గోపిరెడ్డి గారిపై అక్రమ కేసులు పెట్టారు... చిలకలూరిపేటలో నన్ను ఏవిధంగా వేధించారు?" అని రజని ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి, అధికార పార్టీ మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమించవద్దు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో మేం కూడా చట్టపరంగా పోరాడతాం. అప్పుడు మిమ్మల్ని బాధ్యుల్ని చేస్తాం. మీ ఉద్యోగ ధర్మాన్ని పాటించండి" అని విడదల రజని పోలీసులకు హితవు పలికారు. పిన్నెల్లి సోదరుల విషయంలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
Vidadala Rajini
Pinnelli Ramakrishna Reddy
Macherla
Andhra Pradesh Police
YSRCP
TDP
Political pressure
Illegal cases
Palnadu district
Political Vendetta

More Telugu News