Chandrababu Naidu: పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.. చంద్రబాబు

Chandrababu Naidu Salutes TDP Workers at Mahanadu
  • 2024 ఎన్నికల్లో గెలుపునకు పసుపు సైనికులే కారణం
  • నిస్వార్థంగా జెండా మోస్తున్న కార్యకర్తలే టీడీపీకి బలం
  • గత ప్రభుత్వం కక్షగట్టి వేధించినా ఎత్తిన జెండా దించలేదు
  • పార్టీ పని అయిపోయిందన్న వారి పనే అయిపోయింది
  • దేశంలో ఏ పార్టీ ఎదుర్కోనన్ని సంక్షోభాలను టీడీపీ ఎదుర్కొంది
  • మహానాడు ప్రారంభోత్సవ ప్రసంగంలో చంద్రబాబు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు. గత ప్రభుత్వం కక్షగట్టి వేధించినా ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలు అందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన చెప్పారు. కడపలో మంగళవారం ఉదయం మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు.

ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది..
‘‘కడప గడ్డపై తొలిసారి మహానాడు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో పదింటికి ఏడు స్థానాలు గెలిచాం. ఈసారి ఇంకొంచెం కష్టపడి పదికి పది గెలవాలి. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93 శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించి అద్భుత విజయం సాధించాం. ఈ ఘన విజయానికి పసుపు సైనికులే కారణం. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఈ విజయం సాధ్యమైంది’’ అని చంద్రబాబు తెలిపారు.

నా శక్తి, నా ఆయుధం మీరే..
‘‘నేనో సైనికుడిని.. నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే.. మీరు నేను కలిస్తే మనకు ఆకాశమే హద్దు. మనం ఏ పనైనా చేయగలం. దీనికి మీరు సిద్ధమేనా’’ అని కార్యకర్తలను చంద్రబాబు ప్రశ్నించారు. నీతి నిజాయితీ రాజకీయాలు, విజన్ తో ముందుకు వెళ్లే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ బ్రాండ్ అని చంద్రబాబు చెప్పారు. రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అవినీతిపై పోరాడామని, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి రహిత పాలన అందించామని తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో చూసినా కూడా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారని గుర్తుచేశారు. టీడీపీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదు, చెరిపేస్తే చెరిగేది కాదని చంద్రబాబు పేర్కొన్నారు.

పార్టీ పని అయిపోయిందన్నారు కానీ..
‘‘పార్టీ పని అయిపోయిందని మాట్లాడారు కానీ అలా హేళన చేసిన వారి పనే అయిపోయింది. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. హత్యా రాజకీయాలు, కక్ష సాధింపులే పాలనగా గత ప్రభుత్వం మార్చేసింది. విధ్వంస పాలనతో వైసీపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రాణాలు తీశారు. వెంటాడి, వేటాడి అక్రమ కేసులతో వేధించారు. అయినాసరే ఎత్తిన జెండా దించకుండా మీరు పోరాడారు. మన పసుపు సింహం, కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తున్నా కూడా జై తెలుగుదేశం అంటూనే ప్రాణం వదిలాడు. ఆయన స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.
Chandrababu Naidu
TDP Mahanadu
Telugu Desam Party
Andhra Pradesh Politics
Kadapa
2024 Elections
Telugu States
Political History
Yellow Soldiers
Party Workers

More Telugu News