మహిళా కార్యకర్తను రాత్రిపూట పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లిన బీజేపీ నేత.. వీడియో ఇదిగో!

  • యూపీలోని గోండాలో పార్టీ ఆఫీసులో ఘటన
  • సీసీటీవీ ఫుటేజీ బయటపడడంతో నేత వివరణ
  • సీరియస్ గా స్పందించిన రాష్ట్ర నాయకత్వం.. షోకాజ్ నోటీసులు జారీ
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సీనియర్ నేత ఒకరు మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించారు. రాత్రిపూట పార్టీ ఆఫీసులో ఆయన చేసిన నిర్వాకం సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా స్పందించింది. సదరు నేతకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇదంతా తనపై గిట్టనివారు చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆ నేత వివరణ ఇచ్చుకున్నా రాష్ట్ర నాయకత్వం సంతృప్తి చెందలేదు.

యూపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న ఈ ఘటన గోండా నగరంలో ఏప్రిల్ 12న జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రకారం.. బీజేపీ గోండా జిల్లా అధ్యక్షుడు అమర్ కిశోర్ కశ్యప్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మెట్లపై నిలబడి ఓ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. మరో వీడియోలో సదరు మహిళా కార్యకర్తను కశ్యప్ తన కారులో పార్టీ ఆఫీసుకు తీసుకురావడం, మెట్ల ద్వారా పైకి వెళ్లాలని సైగలు చేయడం కనిపిస్తోంది. ఈ వీడియో ఫుటేజీ ఆధారంగా జిల్లాకు చెందిన మరో నేత బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కశ్యప్ ప్రవర్తన పార్టీకి తలవంపులు తెస్తోందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

వీడియోపై కశ్యప్ వివరణ..
సోషల్ మీడియాలో తన వీడియో వైరల్ గా మారిన వెంటనే అమర్ కిశోర్ కశ్యప్ వివరణ ఇచ్చుకున్నాడు. ఇదంతా తనపై ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. వీడియోలో కనిపిస్తున్నది మహిళ బీజేపీ కార్యకర్త అని, ఆ రోజు ఆమెకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. విశ్రాంతి తీసుకుంటానని అడిగితే పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లానని తెలిపాడు. మెట్లు ఎక్కుతుండగా కళ్లు తిరిగి పడిపోబోతుంటే ఆమెకు సాయం చేశానని చెప్పుకొచ్చాడు. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటనకు తప్పుడు అర్థాలు తీస్తున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కశ్యప్ మండిపడ్డాడు.


More Telugu News