Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం... పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ పై ఆరేళ్ల బహిష్కరణ వేటు

Lalu Prasad Yadav Expels Tej Pratap Yadav for 6 Years
  • పెద్ద కొడుకు ప్రవర్తనపై లాలూ ఆగ్రహం
  • తేజ్‌ ప్రతాప్‌కు పార్టీ నుంచి, ఫ్యామిలీ నుంచి ఉద్వాసన
  • కుటుంబ విలువలే ముఖ్యమని ఉద్ఘాటన
బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, బాధ్యతారహిత ప్రవర్తన, కుటుంబ విలువలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారన్న కారణాలతో తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి, అలాగే యాదవ్ కుటుంబం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ సంచలన నిర్ణయాన్ని ఆయన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ తన పోస్టులో, "వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం వల్ల సామాజిక న్యాయం కోసం మనం చేస్తున్న సమష్టి పోరాటం బలహీనపడుతుంది. పెద్ద కుమారుడి కార్యకలాపాలు, బహిరంగ ప్రవర్తన, బాధ్యతారహిత వైఖరి మన కుటుంబ విలువలకు అనుగుణంగా లేవు. అందువల్ల, అతన్ని పార్టీ నుంచి, కుటుంబం నుంచి తొలగిస్తున్నాను. ఇప్పటి నుంచి పార్టీలో గానీ, కుటుంబంలో గానీ అతనికి ఎలాంటి పాత్ర ఉండదు" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, "అతను తన వ్యక్తిగత జీవితంలోని మంచి చెడులు, యోగ్యత అయోగ్యతలను చూసుకోగల సమర్థుడు. అతనితో సంబంధాలు పెట్టుకునే వారు తమ విచక్షణ మేరకు నిర్ణయించుకోవచ్చు" అని లాలూ వ్యాఖ్యానించారు.

తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, అనుష్క యాదవ్‌ అనే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ ఫొటోలో అనుష్క, తేజ్‌ ప్రతాప్‌ కోసం కర్వా చౌత్‌ పూజలు నిర్వహిస్తున్నట్లు కనిపించింది. వీరిద్దరూ గత 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని, ఇటీవల తమ సంబంధాన్ని బహిర్గతం చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై కుటుంబ సభ్యులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, ముందస్తు చర్చ లేకుండా తేజ్‌ ప్రతాప్‌ వ్యవహరించిన తీరు లాలూ ప్రసాద్ యాదవ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ పరిణామాలపై తేజ్‌ ప్రతాప్‌ సోదరుడు, బీహార్ శాసనసభ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ స్పందించారు. "వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం వేర్వేరు. మా అన్నయ్య విషయానికొస్తే, తన వ్యక్తిగత జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకుంది. కానీ ఈ విషయం మాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. మాకు ముందస్తు సమాచారం లేదు" అని తేజస్వి మీడియాకు తెలిపారు.

అదే సమయంలో, కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను సమర్థించలేమని ఆయన స్పష్టం చేశారు. "మేము ప్రజా ప్రతినిధులం. మా నుంచి ప్రజలు ఆశించే గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవాలి. కుటుంబానికి లేదా పార్టీకి అపఖ్యాతి తెచ్చే ప్రవర్తనను మేము ఏమాత్రం సమర్థించం లేదా సహించం" అని తేజస్వి అన్నారు. పార్టీ అధ్యక్షుడు లాలూ యాదవ్ తన అభిప్రాయాలను స్పష్టం చేశారని, పార్టీ ఆయన నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని తేజస్వి యాదవ్ పునరుద్ఘాటించారు.

హసన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, గతంలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన తన విపరీతమైన బహిరంగ ప్రవర్తన, అసాధారణ ప్రకటనల కారణంగా తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. గతంలో తన మాజీ భార్య ఐశ్వర్య రాయ్‌ (మాజీ సీఎం దరోగా రాయ్ కుమార్తె)తో, అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇది యాదవక కుటుంబంలోని అంతర్గత కలహాలపై అనేక ఊహాగానాలకు తావిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Lalu Prasad Yadav
Tej Pratap Yadav
Bihar Politics
RJD
Expulsion
Family Dispute
Tejaswi Yadav
Anushka Yadav
Aishwarya Rai
Political News

More Telugu News