హార్వర్డ్ పై ట్రంప్ వైఖరి పట్ల కెనడా మౌనం... అదే వర్సిటీలో చదువుతున్న కెనడా ప్రధాని కుమార్తె

  • హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల నమోదుపై ట్రంప్ యంత్రాంగంతో న్యాయపోరాటం
  • నిబంధనలు ఉల్లంఘించారంటూ హార్వర్డ్‌పై అమెరికా ప్రభుత్వ ఆరోపణ
  • కెనడా ప్రధాని కుమార్తె సహా పలువురి చదువులకు ఆటంకాలు
  • ట్రంప్ వర్గం కేసు గెలిస్తే విద్యార్థులు కాలేజీ మారాల్సిన దుస్థితి
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న కఠిన వైఖరి, విశ్వవిద్యాలయంతో తలెత్తిన న్యాయ వివాదం ఈ గందరగోళానికి కారణమైంది. ఈ వివాదంలో కెనడా ప్రధాని కుమార్తె క్లియో కార్నీ వంటి పలువురు వీఐపీల పిల్లలు కూడా చిక్కుకోవడంతో ఇది అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

కెనడా ప్రధాని మార్క్ కార్నీ కుమార్తె క్లియో కార్నీ కూడా హార్వర్డ్‌లో మొదటి సంవత్సరం విద్యార్థిని. ఆమె సోషల్ స్టడీస్‌తో పాటు ఇంధనం, పర్యావరణం సబ్జెక్టులను చదువుతున్నారు. మార్చి 2025లో ఒట్టావాలో జరిగిన లిబరల్ పార్టీ నాయకత్వ కార్యక్రమంలో తన తండ్రిని కెనడా 24వ ప్రధానిగా ప్రకటించినప్పుడు, క్లియోనే ఆయనను సభకు పరిచయం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలకు ముందు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న క్లియో, తన తండ్రికి మద్దతుగా ప్రచారం చేశారు. 

"మా నాన్నగారు ఆర్భాటంగా మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడూ సూత్రాలకు కట్టుబడి ఉంటారు. ఇతరులు చెప్పేది వింటారు, ప్రదర్శనలకు పోరు. నిజాయతీని నమ్ముతారు. అదే నిశ్శబ్ద నాయకత్వం అంటే... అహంకారం లేకుండా పనిచేయడం. మా నాన్న దేశం మనందరి కోసం పనిచేయాలనే పోటీ చేస్తున్నారు, పేరు కోసం కాదు" అని ఆమె ఆ సమయంలో రాశారు. 

గత ఐదేళ్లలో నేరాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వలసేతర విద్యార్థుల పూర్తి వివరాలను సమర్పించాలని ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్‌ను ఆదేశించింది. విశ్వవిద్యాలయం ఈ ఆదేశాలను పాటించలేదని, గడువు ముగిసినా స్పందించలేదని ఆరోపణలున్నాయి. దీంతో ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం, విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా హార్వర్డ్‌పై నిషేధం విధించే దిశగా అడుగులు వేసింది. దీనిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ప్రస్తుతానికి తాత్కాలిక స్టే సాధించింది. అయితే, ఈ న్యాయపోరాటంలో ట్రంప్ యంత్రాంగం విజయం సాధిస్తే, ప్రస్తుతం హార్వర్డ్‌లో చదువుతున్న వేలాది విదేశీ విద్యార్థులు తమ చదువులు అర్ధాంతరంగా ముగించుకుని ఇతర కళాశాలలకు మారాల్సిన దుస్థితి ఏర్పడుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.





More Telugu News