నువ్వు చనిపోవచ్చు కదా అంటూ భర్త వేధింపులు.. యూపీలో నవ వధువు ఆత్మహత్య

  • అబార్షన్ కావడంతో వైద్యానికి ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగివ్వాలని మామ డిమాండ్
  • ఆడపడుచు కూడా వేధించిందంటూ సూసైడ్ వీడియోలో వాపోయిన బాధితురాలు
  • ముందురోజు తనను కాపాడాలని ఫోన్ చేసిందన్న బాధితురాలి తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భర్త, మామ, ఆడపడుచు వేధింపులు భరించలేక నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. తన ఆవేదనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మురాదాబాద్ కు చెందిన అమ్రీన్ జహాన్‌ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. భర్త కుటుంబంతో పాటు మురాదాబాద్ లో నివసిస్తోంది. అమ్రీన్ భర్త బెంగళూరులో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అమ్రీన్ కు అబార్షన్ అయింది. ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నాక వేధింపులు మొదలయ్యాయని అమ్రీన్ తెలిపింది.

నిత్యం వేధింపులు భరించలేకపోతున్నా..
మామ, ఆడపడుచు నిత్యం ఏదో విషయంపై తనను తిడతారని ఆవేదన వ్యక్తం చేసింది. "కొన్నిసార్లు నా తిండి గురించి అంటారు, కొన్నిసార్లు నా గదికి కరెంట్ తీసేస్తారు. నా భర్తకు లేనిపోనివి చెబుతారు. నా ఆడపడుచు ఖతీజా, మామ షాహిద్ నా చావుకు కారణం. నా భర్త కూడా కొంత కారణమే. నన్ను అర్థం చేసుకోకుండా తప్పంతా నాదే అంటాడు. నువ్వు ఎప్పుడు చనిపోతావని అడుగుతాడు. నా ఆడపడుచు, మామ కూడా అదే మాట అంటారు. నేనిక భరించలేను" అని ఆవేదన చెందింది.

అనారోగ్యంతో ఉన్నప్పుడు చికిత్సకు అయిన ఖర్చు విషయంలో కూడా వేధించారని, ఆ డబ్బు తిరిగి ఇచ్చేయమని అడిగారని వాపోయింది. నా భర్త దగ్గర అంత డబ్బు ఉంటే మిమ్మల్ని అప్పు అడుగుతాడా? అని ప్రశ్నించింది. "చనిపోయాక ఏమవుతుందో తెలియదు కానీ, ఇప్పటికన్నా బాగుంటాను" అంటూ కెమెరా ముందే ప్రాణాలు తీసుకుంది.

కాపాడాలని ముందురోజే ఫోన్ చేసింది..
ఆత్మహత్య చేసుకోవడానికి ముందురోజు అమ్రీన్ తనకు ఫోన్ చేసి ఏడ్చిందని ఆమె తండ్రి సలీం చెప్పారు. తనను కొడుతున్నారని, కాపాడమని వేడుకుందని కన్నీటిపర్యంతమయ్యారు. బిడ్డను కాపాడుకోవడానికి వెళ్లేసరికి ఆమె విగతజీవిగా పడి ఉందని వాపోయాడు. తన కూతురు ఆత్మహత్యకు ఆమె అత్తింటి వారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


More Telugu News