ప్లేఆఫ్స్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్ రిలీఫ్... తిరిగొచ్చిన స్టార్ పేస‌ర్‌

  • తిరిగొచ్చిన బెంగ‌ళూరు జ‌ట్టు స్టార్ పేస‌ర్ హేజిల్‌వుడ్ 
  • ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఆర్‌సీబీ ట్వీట్‌
  • భుజం గాయంతో కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేస‌ర్‌
ప్లేఆఫ్స్‌కు ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)కి బిగ్ రిలీఫ్ ల‌భించింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ జోష్‌ హేజిల్‌వుడ్ తిరిగొచ్చాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఆర్‌సీబీ అత‌డి వీడియోను త‌న అధికారిక 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్ట్ చేసింది. భుజం గాయంతో కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్న హేజిల్‌వుడ్ కోలుకుని తిరిగి జట్టులోకి చేరాడు.

ఇక‌, ఈ సీజన్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అత‌డే. ఇప్ప‌టివ‌ర‌కు కేవలం పది మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ 17.27 సగటు, 8.44 ఎకానమీ రేటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ప్ర‌స్తుతం ఈ ఎడిష‌న్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, ఏప్రిల్ 27 నుంచి అత‌డు బ‌రిలోకి దిగ‌లేదు. 

ఈ క్ర‌మంలో భారత్‌, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ తాత్కాలికంగా రద్దు కావ‌డంతో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. స్వదేశంలో కొంతకాలం పునరావాసం తర్వాత తిరిగి ఐపీఎల్ కోసం రావ‌డంతో ఆర్‌సీబీ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు ఆస్ట్రేలియా సన్నాహాల్లో భాగంగా అతను బ్రిస్బేన్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ సెషన్‌ల త‌ర్వాత హేజిల్‌వుడ్ భార‌త్‌కు తిరిగొచ్చాడు.

కాగా, ఆర్‌సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన విష‌యం తెలిసిందే. కానీ, శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) చేతిలో హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప‌రాజ‌యం ఆ జ‌ట్టును పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలను దెబ్బతీసింది. అయితే, ఇప్పుడు కీల‌క‌మైన ద‌శ‌లో హేజిల్‌వుడ్ పునరాగమనం ఆర్‌సీబీకి బాగా క‌లిసి రానుంది.


More Telugu News