Kodali Nani: బ‌య‌ట‌కు వ‌చ్చిన కొడాలి నాని.. హైదరాబాద్ పెళ్లి వేడుకలో ప్ర‌త్య‌క్షం

Kodali Nani Appears at Hyderabad Wedding Reception After Illness
  • హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ వివాహ రిసెప్ష‌న్ కు హాజ‌రైన వైసీపీ నేత‌
  • చాలా రోజుల త‌ర్వాత ఇలా బ‌య‌ట క‌నిపించిన మాజీ మంత్రి
  • లుక్ అవుట్ నోటీసుల జారీ వేళ కొడాలి బయటకు రావడంపై ఆసక్తికర చర్చ
తీవ్ర అనారోగ్యంతో ముంబ‌యి ఆసుప‌త్రిలో చేరిన వైసీపీ నేత‌, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ వివాహ రిసెప్ష‌న్‌ కు శుక్ర‌వారం ఆయ‌న‌ హాజర‌య్యారు. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌న ఇలా బ‌య‌ట క‌నిపించారు. తన అరెస్టుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ప్రచారం, లుక్ అవుట్ నోటీసుల జారీ వేళ కొడాలి బయటకు రావడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జ‌రుగుతోంది. 

అనారోగ్యంతో కోలుకున్న కొడాలి నాని కొంతకాలం విశ్రాంతి తీసుకునేందుకు అమెరికా వెళతారని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆయనపై పెండింగు కేసులు బయటకు తీయడం వల్ల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ఆయన దేశం దాటకుండా ఉండేందుకు ప్రభుత్వం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. దేశంలో అన్ని విమానాశ్రయాలతోపాటు నౌకాశ్రయాలకు ఆన్ లైన్ లో ఈ నోటీసులు పంపింది. దీంతో కొడాలిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. ఇంత‌లో ఇప్పుడు ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

ఇక‌, కొన్ని నెల‌లుగా గుండె స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న కొడాలి నాని తొలుత హైద‌రాబాద్‌, ఆ త‌ర్వాత ముంబ‌యిలోని ఆసుప‌త్రుల్లో చికిత్స పొందారు. కొద్దిరోజుల కింద‌ట ముంబ‌యి నుంచి హైద‌రాబాద్‌లోని త‌న నివాసానికి చేరుకున్న ఆయ‌న అప్ప‌టినుంచి ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ వివాహ రిసెప్ష‌న్ కు హాజ‌ర‌య్యారు. దీంతో ఆయ‌న తాలూకు ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

Kodali Nani
YS Jagan
YSRCP
Andhra Pradesh Politics
Gachibowli
Hyderabad Wedding
Look Out Notice
AP Politics
TDP Government
Political News

More Telugu News