సీమంతం జ‌రిగిన ప‌ది రోజుల‌కే విషాదం.. బైక్‌పై నుంచి ప‌డి గ‌ర్భిణి మృతి

  • కామారెడ్డి జిల్లా బిచ్కుంద‌లో ఘ‌ట‌న
  • ఏడాది క్రితం వివాహ‌బంధంతో ఒక్క‌టైన జంట‌
  • ఆమె 5 నెల‌ల గ‌ర్భిణి కావ‌డంతో ఈ నెల 14న బిచ్కుంద‌లో సీమంతం
  • సీమంతం త‌ర్వాత భార్య‌ను పుట్టింట్లో వ‌దిలిపెట్టిన భ‌ర్త‌
  • భార్య‌ను తిరిగి బిచ్కుంద‌కు తీసుకువ‌చ్చే క్ర‌మంలో ప్ర‌మాదం
  • భార్య మృతి.. ఆమె మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక యాసిడ్ తాగి భ‌ర్త ఆత్మ‌హ‌త్య
కామారెడ్డి జిల్లా బిచ్కుంద‌లో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. బైక్‌పై నుంచి ప‌డి గ‌ర్భిణి మృతిచెందింది. భార్య మృతిని త‌ట్టుకోలేక భ‌ర్త యాసిడ్ తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప‌ది రోజుల కింద బంధువుల స‌మ‌క్షంలో సంబరంగా సీమంతం జ‌ర‌గ‌గా... ఇంత‌లోనే రోడ్డు ప్ర‌మాదం రూపంలో ఆ కుటుంబంలో విషాదం నింపింది. 

వివ‌రాల్లోకి వెళితే... ఏడాది క్రితం బిచ్కుంద‌కు చెందిన మంగ‌లి సునీల్‌ (30)కు మ‌ద్నూర్ మండ‌లం పెద్దత‌డ్గూర్‌కు చెందిన జ్యోతి (27)తో వివాహ‌మైంది. ఆమె 5 నెల‌ల గ‌ర్భిణి కావ‌డంతో ఈ నెల 14న బిచ్కుంద‌లో సీమంతం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత జ్యోతిని ఆమె పుట్టింట్లో వ‌దిలేసి వ‌చ్చారు. దీంతో భార్య‌ను తిరిగి బిచ్కుంద‌కు తీసుకురావ‌డానికి సునీల్ శుక్ర‌వారం ఉద‌యం అత్తవారి ఇంటికి వెళ్లారు. 

దంప‌తులిద్ద‌రూ బైక్‌పై వ‌స్తున్న క్ర‌మంలో బిచ్కుంద శివారులోని పెద్ద మైస‌మ్మ గుడి వ‌ద్ద జ్యోతి వాహ‌నంపై నుంచి కింద ప‌డ్డారు. దాంతో ఆమె త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అంబులెన్స్‌లో బాన్సువాడ ప్ర‌భుత్వాసుప‌త్రికి తర‌లిస్తుండ‌గా మార్గంమ‌ధ్య‌లోనే ఆమె చ‌నిపోయింది. పోస్టుమార్టం అనంత‌రం జ్యోతి మృత‌దేహాన్ని బిచ్కుంద‌కు తీసుకురాగా... ఇంటి వ‌ద్ద కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. 

అప్ప‌టివ‌ర‌కు త‌న‌తో క‌బుర్లు చెప్పిన భార్య‌ విగ‌త‌జీవిగా మార‌డంతో సునీల్‌ తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. బాత్‌రూంలోకి వెళ్లి యాసిడ్ తాగారు. బ‌య‌ట‌కు వ‌చ్చి వాంతులు చేసుకోవ‌డంతో అత‌డిని చికిత్స కోసం వెంట‌నే నిజామాబాద్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ శుక్ర‌వారం రాత్రి మృతిచెందారు. భార్యాభ‌ర్త‌ల మృతితో రెండు కుటుంబాల‌లో విషాదం నెల‌కొంది. ఈ ఘ‌ట‌న స్థానికుల‌ను తీవ్రంగా క‌లిచివేసింది.  


More Telugu News