Miss World 2025: మిస్ వ‌ర‌ల్డ్‌-2025 గ్రాండ్ ఫినాలేకు ఇండియ‌న్ బ్యూటీ నందిని గుప్తా

Nandini Gupta Qualifies for Miss World 2025 Grand Finale
  • మిస్ వ‌ర‌ల్డ్‌-2025 టాప్ మోడ‌ల్ కాంపిటిష‌న్‌లో స‌త్తా చాటిన‌ మిస్ ఇండియా నందిని గుప్తా 
  • నిన్న జ‌రిగిన మిస్ వరల్డ్ 2025 టాప్ మోడల్ ఛాలెంజ్‌
  • ఇందులో నలుగురు ఖండాంతర విజేతలలో ఒకరిగా నిలిచిన ఇండియ‌న్ బ్యూటీ
  • ఈ నెల 31న జ‌రిగే గ్రాండ్ ఫినాలేలో టైటిల్ కోసం పోటీప‌డ‌నున్న న‌లుగురు అంద‌గ‌త్తెలు
హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ మిస్ వ‌ర‌ల్డ్‌-2025 టాప్ మోడ‌ల్ కాంపిటిష‌న్‌లో మిస్ ఇండియా నందిని గుప్తా స‌త్తా చాటారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 టాప్ మోడల్ ఛాలెంజ్‌లో నందిని గుప్తా నలుగురు ఖండాంతర విజేతలలో ఒకరిగా నిలిచారు.

యూర‌ప్ నుంచి అంద‌గ‌త్తె మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ట్, ఆఫ్రికా నుంచి మిస్ నమీబియా సెల్మా కమాన్య, అమెరికా అండ్ క‌రేబియ‌న్‌ నుంచి మిస్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్, ఆసియా అండ్‌ ఓషియానియా నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా విజేత‌లుగా నిలిచారు. దీంతో ఈ న‌లుగురు విజేత‌లు ఈ నెల 31న జ‌రిగే గ్రాండ్ ఫినాలేలో చోటు ద‌క్కించుకున్న‌ట్లు నిర్వాహకులు వెల్ల‌డించారు. 

ఇక‌, ఈ ఆకర్షణీయమైన ఫ్యాషన్ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 108 మంది పోటీదారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దేశానికి, ఖండానికి ప్రాతినిధ్యం వహించారు. వీరిలో గ్రాండ్ ఫినాలేకు న‌లుగురు అంద‌గ‌త్తెల‌ను ఎంపిక చేయ‌డం అనేక దశల్లో జరిగింది. ప్రారంభంలో ప్రతి ఖండం నుంచి ఇద్దరు ఫైనలిస్టులను షార్ట్‌లిస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఆఫ్రికా నుంచి మిస్ కోట్ డి ఐవోయిర్ ఫటౌమాటా కౌలిబాలీ, మిస్ నమీబియా సెల్మా కమన్యా ఎంపికయ్యారు. 

అమెరికా అండ్‌ కరేబియన్‌కు ప్రాతినిధ్యం వహించిన వారిలో మిస్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్, మిస్ వెనిజులా వలేరియా కన్నవో ఉన్నారు. ఆసియా అండ్ ఓషియానియా ఫైనలిస్టులలో మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ న్యూజిలాండ్ సమంతా పూలే ఉన్నారు. మిస్ బెల్జియం కరెన్ జాన్సెన్, మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గెర్హార్డ్ట్ యూరప్ నుంచి అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఎనిమిది మంది నుంచి న‌లుగురిని గ్రాండ్ ఫినాలేకు నిర్వ‌హ‌కులు ఎంపిక చేశారు. 

Miss World 2025
Nandini Gupta
Miss India
Hyderabad
Top Model Challenge
Selma Kamanya
Aurelie Joachim
Jasmine Gerhardt
Beauty Pageant

More Telugu News