చెలరేగిన శ్రేయాస్, స్టొయినిస్.. ఢిల్లీ లక్ష్యం 207 పరుగులు

  • కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత అర్ధశతకం
  • మార్కస్ స్టోయినిస్ మెరుపు వేగంతో 16 బంతుల్లో 44 పరుగులు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా జైపూర్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34 బంతుల్లో 53 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ సెంచరీతో రాణించగా, చివర్లో మార్కస్ స్టోయినిస్ (16 బంతుల్లో 44 పరుగులు; 3 ఫోర్లు, 4 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే ప్రియాంశ్ ఆర్య (6) వికెట్‌ను ముస్తాఫిజుర్ తీశాడు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ (12 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సులు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (18 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో వెనుదిరిగారు.

ఆ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరా (16)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయ్యర్ ఒకవైపు వికెట్లు పడుతున్నా సమయోచితంగా ఆడుతూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ వచ్చాక స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా మోహిత్ శర్మ వేసిన 19వ ఓవర్లో స్టోయినిస్ రెండు సిక్సులు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ మూడు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీశారు. ముఖేష్ కుమార్ ఒక వికెట్ తీశాడు. అయితే, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఢిల్లీ ముందు 207 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.


More Telugu News