YSRCP Office: సేమ్ సీన్... వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో నిప్పు పెట్టిన దుండగులు

YSRCP Office Fire Accident
  • తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి నిప్పు
  • అర్ధరాత్రి వేళ పచ్చదనానికి నిప్పంటించిన ఆగంతకులు
  • ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలో మరోసారి అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి వేళ కార్యాలయం దగ్గర ఉన్న పచ్చదనానికి నిప్పుపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వైసీపీ కేంద్ర కార్యాలయానికి దగ్గర్లో ఉన్న గ్రీనరీలో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై వైసీపీ కార్యాలయ సిబ్బంది తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడి ఉంటారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

గతంలో కూడా ఇదే తరహాలో రెండుసార్లు అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన మొదటిసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకోగా, ఆ మరుసటి రోజే, అంటే ఫిబ్రవరి 6న, పార్టీ ఆఫీసు ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్‌ను అందించాలని పోలీసులు ఫిబ్రవరి 7న పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. అయితే, ఆ రోజు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఫుటేజ్ అందుబాటులో లేదని వైసీపీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. దీంతో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

వరుసగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాద ఘటనలు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతా ఏర్పాట్లపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా, పోలీస్ స్టేషన్‌కు అనుసంధానమయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.
YSRCP Office
Tadepalli
YSR Congress Party
Fire Accident
Andhra Pradesh Politics
Vandalism
Security Breach
Political News

More Telugu News