Pawan Kalyan: టాలీవుడ్‌కు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. 'రిటర్న్ గిఫ్ట్' తప్పదంటూ వ్యాఖ్య!

Pawan Kalyan Warns Tollywood Over Lack of Support
  • ఏపీ ప్రభుత్వం పట్ల సినీ పెద్దలకు కృతజ్ఞత లేదని పవన్ కల్యాణ్ ఆవేదన
  • ముఖ్యమంత్రిని కలవకపోవడంపై డిప్యూటీ సీఎం అసంతృప్తి
  • గత ప్రభుత్వ వేధింపులు మరిచారంటూ చురకలు
  • వ్యక్తిగత టికెట్ ధరల వినతులు ఇక కుదరవని స్పష్టీకరణ
తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా, కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు కూడా సినీ ప్రముఖులు ముందుకు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని, అగ్ర నటులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందో అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం వ్యక్తులను కాకుండా, పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటుందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ నుంచి అందిన ఈ 'రిటర్న్ గిఫ్ట్‌'ను తగిన రీతిలోనే స్వీకరిస్తానని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామంటూ ఇటీవల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చేసిన హెచ్చరికలు, ఆ తర్వాత ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన చర్చల అనంతరం అలాంటిదేమీ లేదని ప్రకటించిన పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

గత ప్రభుత్వ ఇబ్బందులు మర్చిపోయారా?

"ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, తెలుగు సినీ రంగంలోని వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా, ఒక్కసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

"అందరూ కలిసి రావాలి అని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదు. అగ్ర నటులు, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించిందో అందరూ మర్చిపోయారు. నాటి ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా?" అని ప్రశ్నించారు.

ఇకపై వ్యక్తిగత విజ్ఞప్తులు కుదరవు

"ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు 'అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు' అని చెప్పాను. అయినా, ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ను తగిన విధంగానే స్వీకరిస్తా. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తా. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తా" అని స్పష్టం చేశారు.

థియేటర్ల నిర్వహణ, సౌకర్యాలపై ఆరా

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల నిర్వహణ, ప్రేక్షకులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత శాఖలతో సమీక్షించారు. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అధికంగా ఉండటం, తాగునీటి సదుపాయం సరిగా లేకపోవడం వంటి అంశాలపై ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై దృష్టి సారించారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల నిర్వహణ, టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సినిమా రంగంలోని 24 విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్లు సమాచారం.
Pawan Kalyan
Telugu Film Industry
Andhra Pradesh
Chandrababu Naidu
Tollywood

More Telugu News