భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ

  • షెంజెన్ వీసాల జారీలో భారతీయులకు షాక్
  • గత ఏడాది 1.65 లక్షల భారతీయుల దరఖాస్తులు తిరస్కరణ
  • వీసా దరఖాస్తుల తిరస్కరణ జాబితాలో మూడో స్థానంలో భారత్
ఐరోపా దేశాల పర్యటనకు ఏటా లక్షలాది మంది విదేశీయులు వెళుతుంటారు. అయితే, షెంజెన్ వీసా దరఖాస్తుల్లో అధిక సంఖ్యలో తిరస్కరణలు చోటు చేసుకోవడంతో దరఖాస్తుదారులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించిన వీసా దరఖాస్తులు సైతం లక్షల్లో తిరస్కరణకు గురవుతున్నాయి.

దరఖాస్తుల తిరస్కరణ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తద్వారా భారతీయ దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు నష్టపోయారు. యూరోపియన్ కమిషన్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

షెంజెన్ సభ్యదేశాలకు గత ఏడాది వచ్చిన మొత్తం వీసా దరఖాస్తుల్లో 17 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు కాండ్ నాస్ట్ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ దరఖాస్తు రుసుముల ద్వారా రూ.1,410 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా.

భారత్ నుంచి 11.08 లక్షల వీసా దరఖాస్తులు రాగా, వాటిలో 1.65 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది జూన్‌లో వీసా రుసుమును 80 నుంచి 90 యూరోలకు పెంచిన నేపథ్యంలో, సగటున 85 యూరోలుగా పరిగణలోకి తీసుకుంటే మొత్తం రూ.136 కోట్లు నష్టపోయినట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 


More Telugu News