రికార్డు సృష్టించిన ఐపీఎల్‌-2025

  • ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు 200+ టీమ్ స్కోర్లు న‌మోదైన సీజ‌న్‌గా 2025
  • ఈ 18వ ఎడిష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆయా జ‌ట్ల స్కోరు 42 సార్లు 200 దాటిన వైనం
  • 2024లో 41, 2023లో 37, 2022లో 18, 2018లో 15 సార్లు 200+ స్కోర్లు న‌మోదు
ల‌క్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో శుక్ర‌వారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 231 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు 200+ టీమ్ స్కోర్లు న‌మోదైన సీజ‌న్‌గా 2025 నిలిచింది. 

ఈ 18వ ఎడిష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆయా జ‌ట్ల స్కోరు 42 సార్లు 200 దాటింది. అంత‌కుముందు 2024లో 41, 2023లో 37, 2022లో 18, 2018లో 15 సార్లు 200+ స్కోర్లు న‌మోద‌య్యాయి. ఇక‌, ఈ సీజ‌న్‌లో మ‌రికొన్ని మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉన్నందున ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కాగా, ఈ ఎడిష‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) అత్య‌ధికంగా 200 ప్ల‌స్ స్కోర్లు న‌మోదు చేసిన టీమ్‌గా అగ్ర‌స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ జీటీ 7 సార్లు 200+ స్కోర్లు చేయ‌డం విశేషం. 

ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)-6, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ), రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) చెరో ఐదుసార్లు, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌), ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) త‌లో 4సార్లు,  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)-3 సార్లు 200+ స్కోర్లు చేశాయి. 

కాగా, నిన్న‌టి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ 42 ప‌రుగుల తేడాతో బెంగ‌ళూరును ఓడించింది. 232 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ 189 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఇక ఇప్ప‌టికే ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించిన ఆర్‌సీబీ ఈ ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి ప‌డిపోయింది. గుజ‌రాత్ 18 పాయింట్లతో ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.  


More Telugu News