Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విలాసవంత జీవితం.. స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ!

Jyoti Malhotra Sponsored by UAE Company Wego Travel
  • పాక్ గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రాపై దర్యాప్తు ముమ్మరం
  • ఆమె విదేశీ ప్రయాణాలకు నిధులపై పోలీసుల దృష్టి
  • యూఏఈకి చెందిన 'వెగో' ట్రావెల్ కంపెనీ స్పాన్సర్‌షిప్ ఇచ్చినట్లు వెల్లడి
  • 'వెగో'కు పాకిస్థాన్‌లోనూ కార్యకలాపాలకు అనుమతి
  • జ్యోతి విలాసవంతమైన జీవితంపై అనుమానాలతో లోతైన విచారణ
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె విలాసవంతమైన జీవనశైలి, విదేశీ పర్యటనలకు నిధులు ఎలా సమకూరాయన్న కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

జ్యోతి మల్హోత్రా చేసిన కొన్ని వీడియోలకు యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న 'వెగో' అనే ట్రావెల్ కంపెనీ స్పాన్సర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 'వెగో' సంస్థకు అంతర్జాతీయ విమాన రవాణా సంఘం గుర్తింపు ఉంది. సింగపూర్, దుబాయ్ వంటి నగరాల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. అంతేకాకుండా, పాకిస్థాన్‌లోనూ చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించడానికి 'వెగో'కు లైసెన్స్ ఉందని సమాచారం.

అయితే, ఈ సంస్థ నేరుగా పాకిస్థాన్‌కు నిధులు సమకూర్చినట్లు ఆధారాలు లేకపోయినా, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా ప్రయాణాలకు స్పాన్సర్‌గా నిలవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రావెల్ బ్లాగర్‌గా, యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన జ్యోతి మల్హోత్రా 'ట్రావెల్ విత్ జో' పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఛానెల్‌ ద్వారా ఆమె ఇండోనేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో పర్యటించిన వీడియోలను పోస్ట్ చేసింది. ఆమె ఛానెల్‌కు సుమారు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పటికీ, ఆమె అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు స్పాన్సర్లుగా ఎవరు వ్యవహరించారనే దానిపై కూపీ లాగుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Jyoti Malhotra
YouTuber Jyoti Malhotra
Travel with Jo
UAE Company
Wego Travel

More Telugu News