Sattenapalli Harish Kumar: బంగారం, ఉద్యోగాల ఆశ చూపి ఏలూరు వాసి ఘరానా మోసం

Sattenapalli Harish Kumar Arrested for Investment and Job Fraud in Eluru
  • ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ పేరుతో భారీ మోసం
  • బంగారు బిస్కెట్లు, విదేశీ ఉద్యోగాల ఆశ చూపి వసూళ్లు
  • ఏలూరు, హైదరాబాద్, బెంగళూరులో బాధితులు  
  • వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు
ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ నడుపుతున్నానని, పెట్టుబడులపై భారీ లాభాలు ఇస్తానని, తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు సరఫరా చేస్తానని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఓ ఘరానా మోసగాడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరుకు చెందిన సత్తెనపల్లి హరీశ్‌కుమార్‌ అలియాస్‌ రిషి అలియాస్‌ రిషికుమార్‌ ఈ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. అతడి చేతిలో ఏలూరు, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన పలువురు మోసపోయినట్టు తెలుస్తోంది.

నమ్మించి.. నిలువునా ముంచి
పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు శివారు వట్లూరు ఇంద్రప్రస్థ కాలనీకి చెందిన హరీశ్‌కుమార్‌ కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని ప్రగతినగర్, రాయదుర్గం ప్రాంతాల్లో నివసిస్తున్నాడు. తాను చార్టర్డ్ అకౌంటెంట్‌నని, సొంతంగా ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్నానని పలువురిని నమ్మించాడు. ట్రేడ్ బిజినెస్‌లో తనకు మంచి అనుభవం ఉందని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపాడు. ఈ క్రమంలో ఏలూరు శనివారపుపేటకు చెందిన వ్యాపారి పంది సాయికుమార్‌ను కూడా ఇలాగే మభ్యపెట్టాడు. విదేశాల్లో ఉద్యోగం, బంగారు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి, అతని వద్ద నుంచి ఆన్‌లైన్‌లో సుమారు రూ. కోటి వరకు వసూలు చేసి మోసగించాడు.

సాయికుమార్‌ తాను మోసపోయానని గ్రహించి ఏలూరు పోలీసులను ఆశ్రయించారు. అక్కడి సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసును సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. వారు హరీశ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఓ ఆక్వా వ్యాపారిని కూడా రూ.50 లక్షల మేర మోసం చేసినట్టు తెలిసింది. బాధితుడు డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఏలూరు ఇంద్రప్రస్థ కాలనీలోని తన ఇంటిని అతడికి అమ్మి రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే, ఆ ఇంటిని అప్పగించకుండా, తన భార్య, తల్లి, మరదలిని అందులోనే ఉంచి, ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి ఇబ్బందులకు గురిచేశాడు. అలాగే, ఏలూరు శనివారపుపేటకు చెందిన మరో వ్యాపారి దగ్గర రూ.2.50 కోట్లు కాజేసినట్టు కూడా ఆరోపణలున్నాయి.

నగరాలు దాటిన మోసాలు.. వరుస అరెస్టులు 

హరీశ్‌కుమార్‌ మోసాల పర్వం కేవలం ఏలూరుకే పరిమితం కాలేదు. బెంగళూరుకు చెందిన శశాంక్‌ అనే వ్యక్తికి బంగారు బిస్కెట్లు ఇస్తానని నమ్మించి రూ.62 లక్షలు వసూలు చేశాడు. శశాంక్‌ ఫిర్యాదు మేరకు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఇటీవలే హరీశ్‌కుమార్‌ను అరెస్టు చేసి అక్కడి కేంద్ర కారాగారానికి తరలించారు. మరోవైపు, హైదరాబాద్‌లో రెనిల్‌కుమార్‌ అనే వ్యక్తి నుంచి రూ.1.85 కోట్లు మోసం చేసిన ఘటనలో బాధితుడు బషీరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ నెల 4న పీటీ వారెంట్‌పై హరీశ్‌కుమార్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడంతో వారు కూడా పీటీ వారెంట్‌పై నిందితుడిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిందితుడిపై హైదరాబాద్‌లో ఇదే తరహాలో మరో కేసు కూడా నమోదైనట్టు సమాచారం. ఏలూరులో 'మేము కూడా హరీశ్‌కుమార్‌ చేతిలో మోసపోయాం' అంటూ మరికొందరు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మోసాల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Sattenapalli Harish Kumar
Eluru
online investment fraud
gold biscuits
job scam
cyber crime
Andhra Pradesh
financial fraud
cyberabad police
investment scam

More Telugu News