ఢిల్లీలో పెనుగాలుల బీభత్సం.. శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానంలో భారీ కుదుపులు (వీడియో ఇదిగో)

  • ఢిల్లీ, నోయిడాలో ఈ సాయంత్రం ఈదురుగాలులు, వర్షం
  • గంటకు 79 కి.మీ వేగంతో వీచిన ఈదురుగాలులు
  • నేలకూలిన హోర్డింగ్‌లు, విరిగిపడ్డ చెట్లు, పలుచోట్ల విద్యుత్ కట్
  • విమాన సర్వీసులపై ప్రభావం, ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ సూచనలు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీపంలోని నోయిడా ప్రాంతాన్ని ఈ సాయంత్రం పెనుగాలులు, కుండపోత వర్షం ముంచెత్తాయి. అకాల వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడినప్పటికీ, ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈదురుగాలులు, భారీ వర్షంతో ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం మారింది.

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఈ స్థాయిలో గాలుల వేగం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ తీవ్రతకు అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలగా, పలు హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. లోధి రోడ్డు ప్రాంతంలో వడగళ్ల వాన కూడా కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయి.

ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పెనుగాలులు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆకస్మిక వాతావరణ మార్పుల కారణంగా విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు. వాతావరణం అనుకూలించకపోవచ్చని, ప్రయాణికులు తమ విమాన ప్రయాణ వివరాల కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించాలని ఎక్స్ వేదికగా తెలిపారు. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు కూడా తమ ప్రయాణికులకు ఇదే విధమైన సూచనలు చేశాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని కోరాయి.

ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానం భారీ కుదుపులకు లోనైందని షేక్ సమీవుల్లా అనే ప్రయాణికుడు ఎక్స్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు. విమానం గాల్లో ఉండగా సీట్లు తీవ్రంగా కదులుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. కెప్టెన్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని పేర్కొన్నారు.


More Telugu News