Preity Zinta: యంగ్ క్రికెటర్ ను హగ్ చేసుకున్న ఫొటోపై ప్రీతి జింటా స్పందన

- వైభవ్ సూర్యవంశీని ప్రీతి జింటా హగ్ చేసుకున్న ఫొటో వైరల్
- అది మార్ఫింగ్ ఫొటో అన్న ప్రీతి జింటా
- తనకు షాకింగ్ గా ఉందని వ్యాఖ్య
బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ జట్టు (ఐపీఎల్) సహ యజమాని ప్రీతి జింటా, ఓ యువ క్రికెటర్‌ను తాను ఆలింగనం చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోపై స్పందించారు. అది పూర్తిగా మార్ఫింగ్ చేసిన చిత్రమని, అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. అసలు విషయం నిర్ధారించుకోకుండా, అదే మార్ఫింగ్ ఫొటోను ఉపయోగించి ఓ వెబ్‌సైట్ కథనం ప్రచురించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రీతి జింటా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే, ఈ నెల 18వ తేదీన రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత, ప్రీతి జింటా, యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని ఆప్యాయంగా కౌగిలించుకున్నారంటూ కొందరు ఓ ఫొటోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. ఇదే అంశంపై ఓ గుజరాతీ వెబ్‌సైట్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ నేపథ్యంలోనే నటి ప్రీతి జింటా స్పందిస్తూ, "ఆ ఫొటో మార్ఫింగ్ చేయబడింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఓ వెబ్‌సైట్ ఇలాంటి వార్తను ఎలా ప్రచురిస్తుందో అర్థం కావడం లేదు. ఇది చాలా షాకింగ్‌గా ఉంది" అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజానికి, పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రీతి సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి జట్టు సభ్యుడైన యువ క్రికెటర్ వైభవ్‌తో ఆమె అంత చనువుగా ప్రవర్తించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, అది టెక్నాలజీ సాయంతో సృష్టించిన నకిలీ చిత్రమని తేలిపోయింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో ప్రచారమయ్యే ప్రతీ విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని మరోసారి స్పష్టమైంది.