Jagan Mohan Reddy: పేర్లు రాసిపెట్టుకోండి... సినిమా చూపిస్తాం: మరోసారి వార్నింగ్ ఇచ్చిన జగన్

- కూటమి ప్రభుత్వం, అధికారులకు జగన్ తీవ్ర హెచ్చరిక
- అన్యాయాలు చేస్తే ఎవరినీ వదిలేది లేదని వార్నింగ్
- రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని విమర్శ
వైసీపీ అధినేత జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం, కొందరు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా "సినిమా చూపిస్తాం" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తోందని జగన్ ఆరోపించారు. "కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఆ విధంగానే ఉన్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు. తిరువూరు వంటి ప్రాంతాల్లో వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ, టీడీపీ పోటీకి దిగడం, వైసీపీ ఆధిక్యం ఉంటే ఎన్నికలను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ వారిని అరెస్టులు చేస్తూ, టీడీపీ వారిని వదిలేస్తున్నారని విమర్శించారు.
"మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి, కొడతానంటే కొట్టమనండి. కానీ, మాకూ సమయం వస్తుంది. అప్పుడు అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికీ సినిమా చూపిస్తాం. రిటైర్ అయిన వారిని కూడా లాక్కొచ్చి తీరుతాం. దేశం విడిచి పారిపోయినా రప్పిస్తాం" అని జగన్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. చంద్రబాబు నాటిన విత్తనాలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని, మహిళలని కూడా చూడకుండా నెలల తరబడి జైళ్లలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక కేసులో బెయిల్ వస్తే, వెంటనే మరో కేసు నమోదు చేస్తున్నారని, వల్లభనేని వంశీ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన నందిగం సురేష్‌ను కూడా అన్యాయంగా నెలన్నరకు పైగా జైల్లో ఉంచి, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. రేపు కచ్చితంగా వైసీపీ కార్యకర్తే నంబర్ వన్ అవుతాడని, కార్యకర్తలకు అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు. అన్యాయాలకు పాల్పడిన వారికి తగిన శాస్తి తప్పదని పునరుద్ఘాటించారు.