Telangana Weather: తెలంగాణలో వింత వాతావరణం: నేడు, రేపు భారీ వర్షాలు.. వికారాబాద్ జిల్లాలో పొంగిన వాగు

Telangana Weather Heavy Rains Expected Yellow Alert Issued
  • 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • వేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
  • ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి
తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. వేసవి కాలంలోనూ వర్షాకాలాన్ని తలపిస్తూ పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పగటిపూట ఎండలు దంచికొడుతున్నప్పటికీ, సాయంత్రం వేళల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

11 జిల్లాలకు ఎల్లో అలర్ట్
వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం.. బుధవారం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు
మరోవైపు, నైరుతి రుతుపవనాల విస్తరణకు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాలతో పాటు దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

 రికార్డు స్థాయిలో వర్షపాతం.. ఉష్ణోగ్రతలు 
సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో నిర్మల్ జిల్లా బీరెల్లిలో 41.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ విచిత్ర వాతావరణ పరిస్థితులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి.

వడదెబ్బతో ఇద్దరి మృతి 
ఈ అకాల వర్షాలు ఒకవైపు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చింతకాని మండల వనరుల కేంద్రంలో పనిచేస్తున్న విద్యాశాఖ కాంట్రాక్టు ఉద్యోగి కవికొండల శ్రీనివాస వెంకటకృష్ణారావు (57), వైరా మున్సిపాలిటీ పరిధిలో రేకుల ముత్తమ్మ (49) వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయారు.

మండు వేసవిలో పొంగిన వాగు 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని ధర్మాపూర్ వాగు మండు వేసవిలోనే ఉప్పొంగి ప్రవహిస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వానలతో వాగులోకి భారీగా వరద నీరు చేరడంతో సాయంత్రం నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
Telangana Weather
Hyderabad Meteorological Center
Heavy Rains
Yellow Alert
Southwest Monsoon
Heatwave Deaths
Vikarabad
Narayana Peta
Rainfall Record
Summer Rains

More Telugu News