Bill Gates: సీఎం చంద్రబాబు చొరవను ప్రశంసిస్తూ బిల్ గేట్స్ లేఖ

Bill Gates Praises CM Chandrababu Naidu Initiative in Letter
  • సీఎం చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లేఖ
  • బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం
  • ఒప్పందం కోసం సీఎం చూపిన చొరవకు బిల్ గేట్స్ ప్రశంస
  • వ్యవసాయం, పేదలకు విద్య, ఆరోగ్యంపై ఒప్పందం
  • సీఎం దూరదృష్టి అమోఘమన్న బిల్ గేట్స్
  • పాలనలో టెక్నాలజీ వినియోగంపై సీఎం ఆసక్తికి అభినందన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇండియాతో కీలక ఒప్పందం చేసుకోవడంలో సీఎం చంద్రబాబు చూపిన చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమవుతుందని బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇండియా విభాగంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటన విజయవంతం కావడం, కీలక ఒప్పందాలు కుదరడం పట్ల బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా లేఖ రాసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి, రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకోవడం చంద్రబాబు విజన్ కు నిదర్శనమని బిల్ గేట్స్ తన లేఖలో కొనియాడారు.

పరిపాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి, వాటి ద్వారా ప్రభుత్వ సేవలను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఆసక్తి చూపుతున్నారని బిల్ గేట్స్ ప్రస్తావించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఎంపిక చేసుకున్న రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పురోగతి సాధిస్తుందన్న పూర్తి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫౌండేషన్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా బిల్ గేట్స్ హామీ ఇచ్చారు. 
Bill Gates
Chandrababu Naidu
Bill and Melinda Gates Foundation
Andhra Pradesh
AP government
India development
Agriculture development
Healthcare
Education

More Telugu News