కొనుగోలు చేసిన టెస్లా కార్లన్నీ వెనక్కి ఇచ్చేస్తున్న డెన్మార్క్ కంపెనీ... కారణం ఇదే!

  • డానిష్ నిర్మాణ సంస్థ 'షెర్నింగ్' కీలక నిర్ణయం
  • కంపెనీ ఫ్లీట్‌లోని అన్ని టెస్లా కార్లు వెనక్కి
  • ఎలాన్ మస్క్ రాజకీయ అభిప్రాయాలే కారణం
  • యూరప్‌లో టెస్లా బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం
  • అమ్మకాలు తగ్గడంతో పాటు ఉద్యోగ కోతల భయాలు
  • యూరోపియన్ కార్ల వైపు మొగ్గు చూపుతున్న కంపెనీలు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, మస్క్ రాజకీయ వైఖరులు, బహిరంగ వ్యాఖ్యల కారణంగా టెస్లా కార్లను ఓ ప్రముఖ సంస్థ వెనక్కి ఇచ్చేయడం చర్చనీయాంశంగా మారింది. డెన్మార్క్‌కు చెందిన నిర్మాణ రంగ సంస్థ 'షెర్నింగ్' (Tscherning), తమ కార్పొరేట్ వాహన సముదాయంలోని అన్ని టెస్లా కార్లను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక ఎలాన్ మస్క్ రాజకీయ వైఖరే ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఈ పరిణామం యూరప్‌లో టెస్లా బ్రాండ్ ఇమేజ్‌పై, అమ్మకాలపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డానిష్ నిర్మాణ సంస్థ షెర్నింగ్, తమ వద్ద ఉన్న టెస్లా కార్లన్నింటినీ వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు కార్లను తిరిగి అప్పగిస్తున్న వీడియోను కూడా పంచుకుంది. టెస్లా కార్లు నాణ్యత లేనివని కాదని, కేవలం ఎలాన్ మస్క్ రాజకీయ నిబద్ధత, ఆయన బహిరంగంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "షెర్నింగ్‌లో, మేము కేవలం ఎలా నడపాలనేదే కాదు, ఎవరితో కలిసి ప్రయాణించాలనేది కూడా నిర్ణయించుకుంటాం. అందుకే మా టెస్లా కంపెనీ కార్ల తాళాలను తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. టెస్లా కార్లు చెడ్డవని కాదు, కానీ ఎలాన్ మస్క్ రాజకీయ నిబద్ధత, ఆయన బహిరంగంగా వెల్లడిస్తున్న అభిప్రాయాల (వాటిని విస్మరించడం కష్టంగా మారుతోంది) దృష్ట్యా, 'ఇంతకాలం ప్రయాణానికి ధన్యవాదాలు' అని చెప్పాలని ఒక కంపెనీగా మేము నిర్ణయించుకున్నాం" అని షెర్నింగ్ పేర్కొంది.

"ప్రస్తుతం టెస్లా బ్రాండ్‌తో ముడిపడి ఉన్న విలువలు, రాజకీయ దిశతో మేము సంబంధం కలిగి ఉండాలని అనుకోవడం లేదు" అని కంపెనీ స్పష్టం చేసింది. టెస్లా వాహనాలకు బదులుగా యూరోపియన్ కంపెనీల కార్లను కొనుగోలు చేస్తామని వెల్లడించింది.


More Telugu News