మహారాష్ట్రలో ఘోర‌ అగ్నిప్రమాదం... 8 మంది సజీవదహనం

  • షోలాపూర్‌లోని టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్ర‌మాదం
  • ఎనిమిది మంది మృతి.. పలువురికి గాయాలు
  • మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి 
  • విద్యుత్ షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా ప్ర‌మాదం జ‌రిగింద‌న్న అధికారులు
మహారాష్ట్రలోని షోలాపూర్‌ పారిశ్రామిక హబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షోలాపూర్‌లోని అక్కల్‌కోట్ రోడ్ ఎంఐడీసీ (MIDC) ప్రాంతంలోని ఒక టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో ఆదివారం ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

షోలాపురి చద్దర్, తువ్వాలు తయారు చేసే సెంట్రల్ టెక్స్‌టైల్ మిల్స్‌లో తెల్లవారుజామున 3:45 గంటల ప్రాంతంలో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.  క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తం విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఎనిమిది మంది స‌జీవ‌ద‌హ‌నం కాగా, పలువురు గాయపడ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మృతులను కంపెనీ యజమాని ఉస్మాన్ మన్సూరి (87), అనస్ మన్సూరి (24), సికా మన్సూరి (24), యూసుఫ్ మన్సూరి (1.5), అయేషా బగ్వాన్ (45), మెహతాబ్ బగ్వాన్ (51), హీనా బగ్వాన్ (35), సల్మాన్ బగ్వాన్ (18)గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సుమారు 10 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

అయితే, మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా, షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక విభాగం అధిపతి రాకేశ్‌ సలుంఖే, మరో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో మంటలను అదుపుచేయడానికి ప‌ది గంటలపాటు శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు.


More Telugu News