Shehzaad: యూపీలో పాక్ గూఢచారి అరెస్ట్.. స్మగ్లింగ్ ముసుగులో ఐఎస్ఐకి కీలక సమాచారం

UP Police Arrest ISI Spy Shehzaad Smuggling Racket Uncovers Key Intelligence
  • మొరాదాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ అధికారులు
  •  భారత భద్రతా రహస్యాలు పాక్‌కు చేరవేత
  •  ఐఎస్ఐ ఆపరేషన్లకు, నిధుల బదిలీకి సహకారం
  •  భారతీయ సిమ్ కార్డులు ఐఎస్ఐ ఏజెంట్లకు అందజేత
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) కోసం పనిచేస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) షెహజాద్ అనే నిందితుడిని మొరాదాబాద్ జిల్లాలో అదుపులోకి తీసుకుంది. రాంపూర్ జిల్లాకు చెందిన షెహజాద్ ఐఎస్ఐ కార్యకలాపాలకు భారత్‌లో సహకరిస్తున్నట్టు ఏటీఎస్‌కు పక్కా సమాచారం అందింది. దేశవ్యాప్తంగా పాకిస్థానీ గూఢచార సంస్థల కోసం పనిచేస్తున్న వారిపై కొనసాగుతున్న దాడుల్లో భాగంగానే షెహజాద్ అరెస్ట్ జరిగిందని ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సహా అనేక మందిని ఈ ఆరోపణలపై అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

షెహజాద్ కొంతకాలంగా అధికారుల నిఘాలో ఉన్నాడు. ఇస్లామాబాద్ గూఢచార వర్గాల అండతో అతడు భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. విచారణలో షెహజాద్ పలుమార్లు పాకిస్థాన్‌కు ప్రయాణించినట్టు తేలింది. సౌందర్య సాధనాలు, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులను సరిహద్దులు దాటించి అక్రమంగా వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ దందా కేవలం ఓ ముసుగు మాత్రమేనని, దీని చాటున అతను గూఢచర్య కార్యకలాపాలు నడుపుతున్నాడని అధికారులు పేర్కొన్నారు.

షెహజాద్ పలువురు ఐఎస్ఐ ఏజెంట్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని భారత జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన, రహస్య సమాచారాన్ని వారికి చేరవేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కేవలం సమాచారం అందించడమే కాకుండా, భారత్‌లో ఐఎస్ఐ కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు కూడా షెహజాద్ సహకరిస్తున్నాడని అధికారులు తెలిపారు.

ఐఎస్ఐ ఆదేశాల మేరకు షెహజాద్ భారత్‌లో పనిచేస్తున్న పాకిస్థానీ ఏజెంట్లకు నిధులు కూడా బదిలీ చేసినట్టు తదుపరి దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా, రాంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాల నుంచి కొందరిని స్మగ్లింగ్ పేరుతో పాకిస్థాన్‌కు పంపించి, అక్కడ వారిని ఐఎస్ఐ సంబంధిత కార్యకలాపాల కోసం రిక్రూట్ చేయడానికి కూడా షెహజాద్ ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యక్తుల వీసా, ప్రయాణ పత్రాలను ఐఎస్ఐ ఏజెంట్ల సహాయంతోనే ఏర్పాటు చేసినట్లు సమాచారం.

విధ్వంసక చర్యలకు ఉపయోగపడేలా భారతీయ సిమ్ కార్డులను కూడా షెహజాద్ సేకరించి ఐఎస్ఐ ఏజెంట్లకు అందించినట్టు పోలీసులు తెలిపారు. లక్నోలోని ఏటీఎస్ పోలీస్ స్టేషన్‌లో షెహజాద్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 148, 152 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది.
Shehzaad
ISI Spy
Uttar Pradesh
Anti-Terrorism Squad
ATS
Pakistan
Smuggling
India
National Security
Moradabad

More Telugu News