Chandrababu Naidu: వేర్వేరు ఘటనల్లో ఏడుగురు పిల్లల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

CM Chandrababu Naidu Mourns Death of Seven Children
  • కుప్పం మండలంలో నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారుల మృతి
  • విజయనగరం జిల్లాలో కారులో ఊపిరాడక నలుగురు మృతి
  • ఈ ఘటనలు తనను తీవ్ర వేదనకు గురిచేశాయన్న చంద్రబాబు
విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేరు వేరు ఘటనల్లో ఏడుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేరోజు రెండు ప్రాంతాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు పసిబిడ్డలు దూరమవ్వడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు అడుకుంటూ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించారు. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమి, శాలిని, అశ్విన్ నీటి కుంటలో దిగి ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న వారి తల్లిదండ్రులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు. 

విజయనగరం జిల్లాలో నలుగురు మృతి

విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు డోర్లు లాక్ పడిన సంఘటనలో నలుగురు చిన్నారులు చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు... ఆగి ఉన్న ఒక కారు ఎక్కగా... డోర్ లాక్ పడి బయటకు రాలేక అందులోనే చనిపోయిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. కారులో చిక్కుకుని ఊపిరి అందక ఉదయ్, జాశ్రిత, చారులత, మణీశ్వరి ప్రాణాలు కోల్పోవడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రెండు ఘటనల్లో 10 ఏళ్లు కూడా నిండని బిడ్డలు చనిపోవడం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని అన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.
Chandrababu Naidu
Child Deaths
Andhra Pradesh
Vijaynagaram
Chittoor
Tragedy
Accident
Condolence

More Telugu News