Kasia: హిమాచల్‌లో పోలిష్ యువతికి చేదు అనుభవం.. ఫోటోకు నిరాకరించడంతో వేధింపులు.. వీడియో ఇదిగో!

Polish Tourist Harassed in Himachal Pradesh Viral Video Sparks Outrage
  • ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన యువతి
  •  విదేశీ మహిళల భద్రతపై మరోసారి చర్చ
  • వేధింపులపై అవగాహన కల్పించడమే తన ఉద్దేశమన్న వ్లాగర్
  • తాను జూలో జంతువును కాదని ఆవేదన వ్యక్తం
పోలాండ్ దేశానికి చెందిన కాసియా అనే యువతి భారత్‌లో తన సోలో ట్రిప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్న సమయంలో తనకు ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఫోటో దిగేందుకు తాను నిరాకరించినందుకు ఓ వ్యక్తి తనను వెంబడించాడని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. కాసియా తన ప్రయాణ అనుభవాలను ఆన్‌లైన్‌లో పంచుకునే ఓ కంటెంట్ క్రియేటర్. హిమాచల్ ప్రదేశ్‌లో తాను బస చేస్తున్న గెస్ట్ హౌస్ నుంచి పర్వత ప్రాంతంలో నడుచుకుంటూ కిందకు వస్తుండగా, ఓ వ్యక్తి ఆమెను సమీపించి ఫోటో అడిగాడు. మొదట తనను ఆ వ్యక్తి ఫోటో తీయమని అడుగుతున్నాడేమో అని కాసియా భావించారు. కానీ, అతను తనతో కలిసి ఫోటో దిగాలని కోరుతున్నాడని కాసేపటికే ఆమె గ్రహించారు.

తాను మాట్లాడేందుకు లేదా ఫోటోలు దిగేందుకు సిద్ధంగా లేనని మర్యాదపూర్వకంగానే తిరస్కరించినట్టు కాసియా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ‘భారత్‌లో చాలా కాలంగా ఉంటున్నాను. ఎంతోమంది అపరిచితులతో సెల్ఫీలు దిగాను. వారితో చిన్నగా మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటివి చేయాలని నాకు ఏమాత్రం అనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.

అయితే, కాసియా నిరాకరించడాన్ని ఆ వ్యక్తి అంగీకరించలేదని తెలుస్తోంది. అతను తనను అనుసరించడం కొనసాగించాడని, హిందీలో ఏదో అరిచాడని ఆమె తెలిపారు. దీంతో కొంత ఆందోళనకు గురైన కాసియా ఆ ఘటనను తన ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించారు. ‘నేను నీతో ఫోటో దిగాలని అనుకోవడం లేదు. దయచేసి నన్ను వెంబడించడం ఆపుతావా? నాకు ఇది నచ్చడం లేదు’ అని ఆమె వీడియోలో అనడం స్పష్టంగా వినిపిస్తోంది. కెమెరాను గమనించగానే ఆ వ్యక్తి కళ్లు తిప్పుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వీడియోలో కనపడింది.

 కాసియా ఆవేదన
ఈ ఘటన తర్వాత తాను తీవ్ర అసౌకర్యానికి లోనయ్యానని కాసియా తన పోస్ట్‌లో తెలిపారు. ‘నేను జూలో జంతువును కాదు. అందరూ వచ్చి చూడటానికి, ఫోటోలు తీసుకోవడానికి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కొందరు భారతీయ పురుషులకు చెబుతున్నా.. దయచేసి నీచంగా ప్రవర్తించకండి. మేం (విదేశీ మహిళలం) మమ్మల్ని మాంసం ముద్దల్లా చూడాలని కోరుకోం. వింతగా చూడటం వల్ల మేం మీతో మాట్లాడాలనుకోం. నేను ఓ వస్తువును కాదు. నా మానాన నన్ను వదిలేయండి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 వివరణ ఇచ్చిన కాసియా
ఈ వీడియో వైరల్ అయిన తర్వాత కాసియా మరో పోస్ట్‌లో ఈ ఘటనపై మరింత వివరణ ఇచ్చారు. ఈ అనుభవం ఎదురైనప్పటికీ తాను ఒంటరి ప్రయాణాలు ఆపబోనని ఆమె స్పష్టం చేశారు. ‘భారత్ కొత్తగా వచ్చేవారికి అంత సులువు కాదు (ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్) అనే ఓ సామెత ఉంది. మహిళలను భయపెట్టాలని గానీ, దేశం మొత్తానికి చెడ్డపేరు తేవాలని గానీ నా ఉద్దేశం కాదు. ఒక పురుషుడు ఎలా ప్రవర్తించకూడదో ఉదాహరణగా చూపించి ఈ విషయంలో అవగాహన కల్పించాలన్నదే నా లక్ష్యం. మీరు భారతీయులైనా, క్రొయేషియన్లైనా, బ్రిటిష్ వారైనా ఇది వర్తిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు.

ఈ వీడియోను పోస్ట్ చేయాలా? వద్దా? అని చాలా ఆలోచించానని, కానీ ఈ సమస్య గురించి మాట్లాడటం ముఖ్యమని భావించి పోస్ట్ చేశానని కాసియా తెలిపారు. ‘మనం సమస్యను గుర్తించి దాని గురించి బహిరంగంగా మాట్లాడకపోతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదు’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటన, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, అందులోనూ విదేశీ పర్యాటకుల భద్రతకు సంబంధించిన ఆందోళనలను మరోసారి ముందుకు తెచ్చింది.
Kasia
Poland
Himachal Pradesh
Harassment
Solo Trip
India Travel Safety
Viral Video
Women's Safety in India
Foreign Tourist Harassment
Indian Men Harassment

More Telugu News