విరాట్ కోహ్లీకి భార‌తర‌త్న ఇవ్వాలి: సురేశ్ రైనా

  • భార‌త క్రికెట్ కోసం కోహ్లీ ఎంతో కృషి చేశాడ‌న్న మాజీ క్రికెట‌ర్‌
  • ఎన్నో అద్భుత విజ‌యాలు సాధించిపెట్టాడ‌ని వ్యాఖ్య‌
  • అందుకుగాను విరాట్‌కు భార‌త ప్ర‌భుత్వం భార‌త‌ర‌త్న‌తో స‌త్క‌రించాల‌న్న రైనా
  • భారత క్రీడా చరిత్రలో ఈ అత్యున్న పుర‌స్కారం అందుకుంది కేవలం స‌చిన్ మాత్ర‌మే  
భారత క్రీడా చరిత్రలో ఒకే ఒక్క క్రీడాకారుడికి భారతరత్న అవార్డు లభించింది. అది మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ సచిన్ టెండూల్కర్. 2014 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఈ లెజెండ్ క్రికెట‌ర్‌ను సిఫార్సు చేసింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లిటిల్ మాస్ట‌ర్‌కు ఈ అత్యున్న‌త పుర‌స్కారాన్ని ప్రదానం చేశారు. 

ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని ఇంతకు ముందు లేదా తరువాత ఏ అథ్లెట్ కూడా అందుకోలేదు. అయితే, భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ చేసిన అపారమైన కృషిని గుర్తించి, ఆయనకు భారతరత్న ఇవ్వాలని తాజాగా భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా డిమాండ్ చేశాడు.

"భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఎన్నో అద్భుత‌మైన‌ విజయాలు సాధించిపెట్టాడు. భార‌త క్రికెట్ జ‌ట్టు కోసం అత‌ను ఎంతో కృషి చేశాడు. భారత క్రికెట్‌లో అతను సాధించిన విజయాలకు గుర్తుగా భారత ప్రభుత్వం అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలి" అని స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన కార్యక్రమంలో రైనా అన్నాడు.

కాగా, భార‌త జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదిత‌మే. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ర‌న్ మెషీన్‌ స్వయంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ చేశాడు. కోహ్లీ తన టెస్ట్ రిటైర్మెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భావోద్వేగంతో ప్రకటించాడు. 

14 ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నాడు. తాను ఎప్పుడూ తన టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటానని తెలిపాడు. ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే కోహ్లీ కూడా లాంగ్ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డం ప్రకటించడం గ‌మ‌నార్హం.

ఇక‌, 36 ఏళ్ల విరాట్‌ భారత్ తరపున 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడాడు. 46.85 సగటుతో 30 సెంచరీలతో సహా 9,230 పరుగులు చేశాడు. గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌ర్వాత పొట్టి ఫార్మాట్‌కు కూడా కోహ్లీ గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పుడు వ‌న్డేల్లో మాత్ర‌మే ఆడ‌నున్నాడు. 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడాల‌నేది కోహ్లీ టార్గెట్.


More Telugu News