Sujana Chowdary: సుజనా చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు

- ఇటీవల లండన్ లో గాయపడిన సుజనా చౌదరి
- హైదరాబాదులో సుజనా నివాసానికి వెళ్లిన చంద్రబాబు
- ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించారు. ఇటీవల లండన్‌లో ప్రమాదానికి గురై, భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సుజనా చౌదరి ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ఉన్న సుజనా చౌదరి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. కొద్ది రోజుల క్రితం లండన్ పర్యటనలో ఉన్నప్పుడు సుజనా చౌదరి ప్రమాదవశాత్తూ బాత్రూంలో జారిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయన కుడి భుజానికి తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ఇక్కడి వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం, వైద్యుల సలహా మేరకు ఆయన పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే, ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సుజనా చౌదరి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రస్తుతం అందుతున్న వైద్యం గురించి కూడా చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం.
సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. వీలైనంత త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవకు అంకితం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.