Rohit Sharma: వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరిట స్టాండ్... ఎమోషనల్ అయిన హిట్ మ్యాన్

- ముంబయి క్రికెట్ అసోసియేషన్ నుంచి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
- వాంఖడే గొప్ప స్టేడియం, దీనితో తనకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయన్న రోహిత్ శర్మ
- భవిష్యత్తులో వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరపున వాంఖడే స్టేడియంలో ఆడాలని ఉందన్న రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ నుంచి అరుదైన గౌరవం లభించింది. వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, అర్ధాంగి రితికతో కలిసి రోహిత్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఎమోషనల్ అయ్యారు. ఈ స్టేడియంతో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
వాంఖడే గొప్ప స్టేడియం అని, దీనితో తనకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరపున వాంఖడే స్టేడియంలో ఆడాలని ఉందనే కోరికను వెలిబుచ్చారు. స్టేడియంలో ఓ స్టాండ్‌కు తన పేరు పెడతారని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ఏ ఆటగాడికైనా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని, దేశానికి సేవ చేయాలని ఉంటుందని, ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు సాధిస్తామని అన్నారు. అయితే, వీటన్నింటికంటే ఇది ఎంతో ప్రత్యేకమని అభిప్రాయపడ్డారు.
గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల మధ్యలో తన పేరు ఉండటాన్ని మాటల్లో చెప్పలేనని, ఇందుకు ముంబయి క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. కాగా, వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్ల పేర్లతో స్టాండ్‌లు ఉండగా, తాజాగా రోహిత్ శర్మ, శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేరిట స్టాండ్లను ఆవిష్కరించారు.