Nitish Kumar Reddy: ఇంగ్లండ్ లో పర్యటించే ఇండియా-ఏ జట్టు ఎంపిక... నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేస్

- అభిమన్యు ఈశ్వరన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు
- జట్టులో యశస్వి, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్‌లకు చోటు
- రెండో మ్యాచ్ నుంచి శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ చేరిక
- ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు, భారత సీనియర్ జట్టుతో ఒక మ్యాచ్
- ఎనిమిదేళ్ల తర్వాత కరుణ్ నాయర్‌కు, తొలిసారి హర్ష్ దూబేకు అవకాశం
త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించనున్న ఇండియా-ఏ జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ఇండియా-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహించనున్నాడు.
ఈ జట్టులో పలువురు ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో పాటు, టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించారు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్) వంటి ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, రెండో మ్యాచ్ నుంచి స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ కూడా జట్టుతో కలవనున్నారు. భవిష్యత్తులో రోహిత్ శర్మ తర్వాత భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు శుభ్‌మన్ గిల్ చేపట్టే అవకాశాలున్నాయని విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
మే 30 నుంచి జూన్ 2 వరకు కాంటర్‌బరీలో తొలి మ్యాచ్, జూన్ 6 నుంచి జూన్ 9 వరకు నార్తాంప్టన్‌లో రెండో మ్యాచ్ జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల అనంతరం, జూన్ 13 నుంచి 16 వరకు బెక్హెమ్‌లో భారత సీనియర్ జట్టుతో భారత-ఎ జట్టు ఒక అంతర్గత మ్యాచ్ ఆడనుంది. జూన్ 20 నుంచి లీడ్స్‌లో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లు ఆటగాళ్లకు మంచి సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి.
సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత కరుణ్ నాయర్ మళ్లీ భారత-ఎ జట్టులోకి రావడం విశేషం. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో 69 వికెట్లతో సత్తా చాటిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే తొలిసారిగా భారత-ఎ జట్టుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు సర్ఫరాజ్ ఖాన్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ వంటి ఆటగాళ్లు కూడా ఈ పర్యటనలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. భారత క్రికెట్ జట్టులో మార్పులు జరుగుతున్న ఈ తరుణంలో ఈ పర్యటన యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులోకి ప్రవేశించడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు.
భారత-ఎ జట్టు వివరాలు
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.
(శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ రెండో మ్యాచ్‌కు ముందు జట్టులో చేరతారు.)