Om Prakash: తల్లి చావును కూడా వదలని కొడుకు.. నగలు కావాలంటూ చితిపై పడుకున్నాడు!..వీడియో ఇదిగో

- రాజస్థాన్‌లో తల్లి అంత్యక్రియలకు కొడుకు ఆటంకం
- వెండి కడియాలు ఇవ్వాలని చితిపై పడుకుని నిరసన
- ఆస్తి తగాదాలే కారణమని గ్రామస్థుల కథనం
- రెండు గంటల పాటు అంత్యక్రియలు నిలిపివేత
- నగలు తీసుకున్నాకే కర్మకాండలకు అనుమతి
- విషయం ఆలస్యంగా వెలుగులోకి, ఘటనపై తీవ్ర విమర్శలు
రాజస్థాన్‌లో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లి మరణించిన బాధ కంటే ఆమె ధరించిన వెండి కడియాలపైనే ఓ కొడుకుకు మమకారం ఎక్కువైంది. ఆ నగలు తనకే దక్కాలని, అవి ఇస్తేనే అంత్యక్రియలు జరగనిస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. చివరకు చితిపైనే పడుకుని సుమారు రెండు గంటల పాటు కర్మకాండలను అడ్డుకున్నాడు. ఈ దారుణ ఘటన కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మే మొదటి వారంలో జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ కొడుకుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, గ్రామానికి చెందిన భురీ దేవి మే 3న మరణించారు. ఆమెకు ఏడుగురు కుమారులు కాగా, ఆరుగురు గ్రామంలో కలిసి ఉంటున్నారు. ఐదో వాడైన ఓంప్రకాశ్ మాత్రం విడిగా నివసిస్తున్నాడు. గత మూడు, నాలుగేళ్లుగా ఓంప్రకాశ్ కు, మిగతా సోదరులకు మధ్య ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి.
భురీ దేవి మరణానంతరం, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆమె ఒంటిపై ఉన్న నగలు, వెండి కడియాలను తీసి పెద్ద కుమారుడైన గిరిధారికి ఇచ్చారు. ఇది ఓంప్రకాశ్ కు ఆగ్రహం తెప్పించింది. తల్లి పాడెను మోస్తున్న వారిలో ఓంప్రకాశ్ కూడా ఉన్నాడు. అయితే, శ్మశాన వాటికకు చేరుకున్నాక పరిస్థితి ఒక్కసారిగా మారింది.
గ్రామస్థులు చితికి కట్టెలు పేర్చుతుండగా, ఓంప్రకాశ్ తన తల్లి వెండి కడియాలు, ఇతర ఆభరణాలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా, చితిపై పడుకుని దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకున్నాడు. దాదాపు రెండు గంటల పాటు గ్రామస్థులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా వినకుండా గందరగోళం సృష్టించాడు.
చివరకు, చేసేది లేక భురీ దేవి వెండి కడియాలు, ఇతర నగలను శ్మశానానికి తెచ్చి ఓంప్రకాశ్ కు అందజేశారు. ఆ తర్వాతే అతను చితిపై నుంచి లేచి అంత్యక్రియలకు అనుమతించాడు. ఈ ఘటన పవిత్రమైన కర్మకాండలను అపవిత్రం చేయడమేనని, కుటుంబ కలహాలు ఇలాంటి దుశ్చర్యలకు దారితీయడం దారుణమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. భురీ దేవి భర్త చిత్రమల్ రెండేళ్ల క్రితమే మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, కుటుంబ వివాదాల తీవ్ర పరిణామాలపై చర్చ జరుగుతోంది.