హైదరాబాద్‌లో ఘోరం.. 14 రోజుల పసికందును పొడిచి చంపిన కసాయి తండ్రి!
- చిన్నారిని చంపి చెత్తకుప్పలో పడేసిన వైనం
- భార్య ఫిర్యాదుతో దారుణం వెలుగులోకి
- నిందితుడు నేపాల్‌కు చెందిన వాచ్‌మన్
వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 14 రోజుల క్రితమే అతడికి అమ్మాయి పుట్టింది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జగత్ తన కుమార్తెను అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని టోలీచౌకిలోని చెత్తకుప్ప సమీపంలో పడేసినట్టు గోల్కొండ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
ఈ దారుణాన్ని గమనించిన నిందితుడి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు జగత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే, ఇంతటి ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలను నిందితుడు ఇంకా వెల్లడించలేదని పోలీసులు పేర్కొన్నారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.