Sunil Gavaskar: సునీల్ గవాస్కర్‌కు అరుదైన గౌరవం.. బీసీసీఐ కార్యాలయంలో ప్రత్యేక బోర్డ్ రూమ్

- '10,000 గవాస్కర్' పేరిట బోర్డ్ రూమ్ ఏర్పాటు
- టెస్టుల్లో పదివేల రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్ సన్నీ
- గవాస్కర్ గౌరవార్థం ఈ గదిని ఏర్పాటు చేశామన్న బీసీసీఐ
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన లిటిల్ మాస్టర్ కోసం బీసీసీఐ ప్రత్యేక బోర్డు రూమ్‌ను ఏర్పాటు చేసింది. ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో '10,000 గవాస్కర్' పేరిట బోర్డ్ రూమ్‌ను గురువారం బీసీసీఐ ప్రారంభించింది. ఆ వీడియోను క్రికెట్ బోర్డు ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా షేర్ చేసింది.
టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన మొదటి భారత క్రికెటర్ అయిన గవాస్కర్ గౌరవార్థం ఈ గదిని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా బీసీసీఐ పేర్కొంది. గదినిండా గవాస్కర్ ఫొటోలు, అతడి కాలంలో భారత జట్టు సాధించిన ట్రోఫీలను పొందుపరిచింది. ఈ సందర్బంగా సన్నీ భావోద్వేగానికి లోనయ్యాడు.
"ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నాకు తల్లితో సమానం. ఇక బీసీసీఐ అయితే తండ్రి లెక్క. ఈ గౌరవానికి ప్రత్యేక ధన్యవాదాలు. భారత్‌కు ఆడే అవకాశం వచ్చినందుకు.. నన్ను ఈ స్థాయికి చేర్చినందుకు భారత క్రికెట్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది నాకు చాలా పెద్ద గౌరవం. ఈ సందర్బంగా బీసీసీఐకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా వంతుగా బీసీసీఐ, భారత క్రికెట్ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా" అని గవాస్కర్ వెల్లడించాడు.
కాగా, ఈ బ్యాటింగ్ లెజెండ్ 10,000 టెస్ట్ పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్. అతను 125 టెస్ట్‌ల్లో 51 కంటే ఎక్కువ సగటుతో 10,122 పరుగులతో తన కెరీర్‌ను ముగించాడు. ఇందులో 34 సెంచరీలు ఉన్నాయి. అలాగే సన్నీ 108 వన్డేల్లో 3092 పరుగులు చేశాడు.
ఇక, అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన అతని రికార్డును సచిన్ టెండూల్కర్ అధిగమించాడు. ఆయన గౌరవార్థం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో 'సచిన్ టెండూల్కర్ గది' కూడా ఉంది. '10,000 గవాస్కర్' బోర్డ్‌రూమ్ ప్రారంభోత్సవంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సెక్రటరీ దేవజిత్ సైకియాలు పాల్గొన్నారు.