Gongidi Sunitha: ప్రపంచ సుందరీమణుల పాదాలు కడిగిన తెలంగాణ మహిళలు! బీఆర్ఎస్ మహిళా నేతల ఆగ్రహం

Telangana Women Wash Feet of Miss World Contestants Sparking Outrage
  • కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించడంపై బీఆర్ఎస్ మహిళా నేతల తీవ్ర అభ్యంతరం
  • ఇది తెలంగాణ సంస్కృతి కాదని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్న గొంగిడి సునీత
  • మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిసి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా, ప్రపంచ సుందరీమణుల పాదాలను తెలంగాణ మహిళలతో కడిగించి, టవల్‌తో తుడిపించిన ఘటన వివాదాస్పదమైంది. ఈ చర్య తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు.

మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత నేతృత్వంలోని మహిళా నేతల బృందం, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఈ ఘటనపై తమ ఆవేదనను తెలియజేశారు.

అనంతరం గొంగిడి సునీత మాట్లాడుతూ, అతిథులకు పాదాలు కడిగి స్వాగతం పలకడం తెలంగాణ సంప్రదాయంలో భాగం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి కార్యక్రమం చేయాలనుకుంటే, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వయంగా చేసి ఉండాల్సిందని, సామాన్య మహిళలతో ఇలాంటి పనులు చేయించడం వారిని అవమానించడమేనని ఆమె అన్నారు.

ఈ చర్య మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, వారిని తక్కువ చేసి చూపేలా ఉందని సునీత ఆరోపించారు. కేవలం కాళ్లు కడిగించడమే కాకుండా, అంతకుముందు మిస్ వరల్డ్ పోటీదారులు పాదరక్షలతో బతుకమ్మ ఆడటం ద్వారా తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కూడా అవమానించారని అన్నారు. ఇలాంటి చర్యలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉందని, వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ఘటనలు మహిళల గౌరవాన్ని కించపరచడమేనని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ సంస్కృతిలో మహిళల పాత్రను గుర్తించి, వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, సమాజంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని ఆమె నొక్కిచెప్పారు. మహిళలు తమ హక్కులను, గౌరవాన్ని కాపాడుకోవడానికి సంఘటితంగా పోరాడాలని గొంగిడి సునీత పిలుపునిచ్చారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ వెంటనే స్పందించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మహిళా నేతలు డిమాండ్ చేశారు.

స్పందించిన సీతక్క

33 మంది ప్రపంచ అందాల భామలు ఒకేసారి బయట కాళ్ళు కడుక్కుంటే అక్కడ నీళ్లు పారతాయన్న ఉద్దేశంతో ఎవరి ప్లేట్లు వారికి, ఎవరి టవల్స్ వారికి ఇచ్చామని మంత్రి సీతక్క వెల్లడించారు. కానీ ఒక అమ్మాయి స్వతహాగా చెంబుతో ఒక కంటెస్టెంటుకు నీళ్లు పోసినంత మాత్రాన రాద్దాంతం చేయడం సరికాదని అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వానికి అంటగట్టవద్దని సూచించారు.
Gongidi Sunitha
Telangana Women
BRS Women Leaders
Miss World Contestants
Telangana Culture
Women's Rights

More Telugu News