Jaishankar: ట్రంప్ 'భారత్ జీరో టారిఫ్ ఆఫర్' వ్యాఖ్యలపై స్పందించిన జైశంకర్

Jaishankar Responds to Trumps Zero Tariff Remarks
  • అమెరికా వస్తువులపై భారత్ జీరో టారిఫ్ ఆఫర్ చేసిందన్న ట్రంప్
  • వాణిజ్యపరమైన చర్చలు జరుగుతున్నాయన్న జైశంకర్
  • ఒప్పందం ఇరు దేశాలకు లాభదాయకం కావాలని వ్యాఖ్య
  • తొందరపడి వ్యాఖ్యలు చేయరాదని ట్రంప్ కు పరోక్ష హితవు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన 'జీరో టారిఫ్' ఆఫర్ల వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక వస్తువులపై భారత్ 'జీరో టారిఫ్‌లు' ఆఫర్ చేసిందని ట్రంప్ అన్నారు.

ఈ వ్యాఖ్యలపై జైశంకర్ స్పందిస్తూ, "రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇవి చాలా సంక్లిష్టమైన చర్చలు. ప్రతి అంశంపైనా తుది నిర్ణయం తీసుకునే వరకు ఇవి సాగుతూనే ఉంటాయి. వాణిజ్య ఒప్పందం అనేది ఇరు దేశాలకూ పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలి. అది ఖరారయ్యే వరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటు అవుతుంది" అని ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే వివరించారు.

భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించని పక్షంలో వాణిజ్యం నిలిపేస్తానని ఇరుదేశాలనూ తాను హెచ్చరించానని, ఆ తర్వాతే వారు అంగీకారానికి వచ్చారని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ ఆందోళన

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం వంటి అంశాలపై ట్రంప్ ప్రకటనలు చేయడం, ముఖ్యంగా మన దేశ అంతర్గత సమస్య అయిన కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు.
Jaishankar
Trump
India-US trade
Zero Tariff
Bilateral talks
India-Pakistan tensions

More Telugu News