Anaya Bangar: కోహ్లీ వద్ద కోచింగ్... ఆసక్తికర అంశం వెల్లడించిన అనయ బంగర్

Anaya Bangar Reveals Virat Kohli Coaching
  • లింగమార్పిడి చేయించుకున్న సంజయ్ బంగర్ కుమార్తె 
  • ఒకప్పుడు ఆర్యన్... ఇప్పుడు అనయ
  • గతంలో పురుషుల దేశవాళీ క్రికెట్ ఆడిన వైనం
  • కోహ్లీ వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకున్నానని తాజాగా అనయ వెల్లడి
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో తనకున్న పరిచయాన్ని, అతడి వద్ద తీసుకున్న శిక్షణను తాజాగా గుర్తు చేసుకున్నారు. తన తండ్రి వద్దే కాకుండా, తాను విరాట్ కోహ్లీ పర్యవేక్షణలో కూడా క్రికెట్ పాఠాలు నేర్చుకున్నానని ఆమె వెల్లడించారు. ఒకప్పుడు ఆర్యన్‌గా ఉన్న అనయ, తనలో అమ్మాయి లక్షణాలను గుర్తించి లింగమార్పిడి చేయించుకుని అనయగా మారారు. క్రికెట్ ఆడే రోజుల్లో తోటి క్రీడాకారుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లీతో తన అనుభవాలను పంచుకుంటూ, "నేను చాలాసార్లు విరాట్ కోహ్లీని కలిశాను. మా నాన్నగారితో పాటు అతడి దగ్గర కోచింగ్ తీసుకున్నాను. నేను బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ చూశాడు. నాకు కొన్ని విలువైన సూచనలు చేశాడు. అతడి బ్యాటింగ్‌ను చాలా దగ్గర నుంచి గమనించే అవకాశం నాకు దక్కింది. తీవ్రమైన ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని ఒక సందర్భంలో నేను కోహ్లీని అడిగాను. అందుకు అతడు, తన బలాలను పూర్తిగా అర్థం చేసుకుని, వాటిపై పూర్తి నమ్మకంతో సాధన చేస్తానని సమాధానమిచ్చాడు. మైదానంలో తాను ఏం చేయగలనో అనే దానిపై కోహ్లీకి పూర్తి స్పష్టత ఉంటుంది. మనం ఎలా ఆడుతున్నామో మనకు తెలిస్తే, మిగతావన్నీ అవే సర్దుకుంటాయని చెప్పాడు" అని అనయ వివరించారు. ఇటీవల అనయ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

తండ్రి సంజయ్ బంగర్ బాటలోనే క్రికెటర్‌గా రాణించాలని అనయ ఆకాంక్షించారు. అనయగా మారకముందు, ఆమె పురుషుల దేశవాళీ క్రికెట్‌లో కూడా పాల్గొన్నారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకున్న ఒక నిర్ణయం ఆమె ఆశలకు ఆటంకం కలిగించింది. 2023 నవంబర్‌లో, మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణులు పాల్గొనరాదని ఐసీసీ నూతన నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలపై అనయ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సంజయ్ బంగర్‌కు, విరాట్ కోహ్లీకి మధ్య మంచి స్నేహబంధం ఉంది. గతంలో సంజయ్ బంగర్ భారత జట్టుకు, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించారు. కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడిన సమయంలో, బంగర్ ఇచ్చిన సలహాలు, సూచనలు అతనికి ఎంతగానో ఉపయోగపడ్డాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.
Anaya Bangar
Virat Kohli
Sanjay Bangar
Cricket Coaching
Transgender Athlete
ICC Rules
Indian Cricket
Women's Cricket
Gender Transition
Sports

More Telugu News