ED Raids: హైదరాబాద్, ముంబైలలో ఈడీ సోదాలు... రూ. 32 కోట్ల ఆస్తుల స్వాధీనం

ED Raids in Hyderabad  Mumbai 32 Crore Cash Gold Seized
  • ముంబై వసాయి విరార్‌ కార్పొరేషన్‌ (వీవీఎంసీ) స్కామ్‌పై ఈడీ దర్యాప్తు వేగవంతం
  • ముంబై, హైదరాబాద్‌ సహా 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
  • రూ.9.04 కోట్ల నగదు, రూ.23.25 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు స్వాధీనం
ముంబైకి చెందిన వసాయి విరార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీవీఎంసీ) పరిధిలో వెలుగుచూసిన భారీ కుంభకోణంపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం అధికారులు కీలక ముందడుగు వేశారు. ముంబై, హైదరాబాద్‌ నగరాలతో పాటు మొత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. సుమారు రూ.9.04 కోట్ల నగదుతో పాటు, రూ.23.25 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.32 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

ముంబైలోని మిరా భయాందర్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ అక్రమాలపై పలు కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా 2009 సంవత్సరం నుంచి అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ఈడీ గుర్తించింది.

ఈ కుంభకోణంలో సీతారాం, అరుణ్ అనే వ్యక్తులు కీలక నిందితులుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. కొందరు అవినీతి అధికారులతో వీరు కుమ్మక్కై, ప్రభుత్వ స్థలాల్లో కూడా చట్టవిరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి, అమాయక ప్రజలకు విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగానే వీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగపు డిప్యూటీ డైరెక్టర్‌ వైఎస్‌ రెడ్డి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితుల ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
ED Raids
Vasai Virar Municipal Corporation
VVMC Scam
Hyderabad
Mumbai
Seetaram
Arun
YS Reddy
Corruption

More Telugu News