Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఆసుపత్రికి తరలింపు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి హూటాహూటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వంశీకి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. అయితే, విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నట్లు సమాచారం.
కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా ఆయన అస్వస్థతకు గురికావడంతో అధికారులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.