Veerayya Chowdary: ప్రకాశం జిల్లా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు

- గత నెల 22న ఒంగోలులో వీరయ్య చౌదరి దారుణ హత్య
- తాజాగా 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
- నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చిన ఎస్పీ దామోదర్
- స్వగ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు కారణమని వెల్లడి
ప్రకాశం జిల్లా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వగ్రామంలో ఆధిపత్య పోరు కారణంగానే వీరయ్య చౌదరిని హత్య చేశారని జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. తాజాగా, ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు. ఇవాళ నిందితులను ఎస్పీ దామోదర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు హత్య చేశారని వెల్లడించారు. దాదాపు 50 కత్తిపోట్లతో వీరయ్య చౌదరి ప్రాణాలు విడిచాడని తెలిపారు.
వీరయ్య చౌదరి హత్యకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని, అతడి ఎదుగుదల చూసి కొందరు ఈర్ష్య చెందారని ఎస్పీ తెలిపారు. దానికితోడు గ్రామంలో ఇసుక వ్యవహారంలో ఆధిపత్య పోరు ఉందని చెప్పారు. ఇక కేసు గురించి చెబుతూ, వీరయ్య చౌదరి హత్యకు ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ప్రణాళఙక రచించాడని వెల్లడించారు. సాంబయ్య ఓ వాస్తు సిద్దాంతి అని తెలిపారు. వినోద్ అనే వ్యక్తి ద్వారా హత్య కుట్ర అమలు చేశారని వివరించారు.
వీరయ్య వల్ల ప్రాబల్యం కోల్పోతున్నట్టు సాంబయ్య గుర్తించాడని, అతడికి వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. వీరయ్య రాజకీయంగా ఎదిగితే తన మేనల్లుడు సురేశ్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అని సాంబయ్య భావించాడని ఎస్పీ దామోదర్ వివరించారు. పైగా వీరయ్య చౌదరికి నామినేటెడ్ పదవి వస్తుందనే ప్రచారంతో సాంబయ్య ఆందోళన చెందాడని, దాంతో, వినోద్ సహకారంతో వీరయ్యను హత్య చేయాలని నిర్ణయించాడని వెల్లడించారు.
వీరయ్య హత్య కోసం రూ.25 లక్షలు ఖర్చు చేశారని, ఈ హత్యలో ప్రత్యక్షంగా నలుగురు పాల్గొన్నారని తెలిపారు. వంశీకృష్ణ, వెంకట గౌతమ్, మన్నెం తేజ (బన్నీ), నాగరాజు ఈ హత్య చేశారని వివరించారు. 100 బృందాలతో గాలించి నిందితులను పట్టుకున్నామని చెప్పారు. సాంబయ్య మేనల్లుడు సురేశ్, నాగరాజు, నాని పరారీలో ఉన్నారని తెలిపారు.