టర్కీ, అజర్ బైజాన్ కు ట్రిప్పులు క్యాన్సిల్ చేసుకుంటున్న భారత పర్యాటకులు

  • పహల్గామ్ ఘటన నేపథ్యంలో పాక్‌కు టర్కీ, అజర్‌బైజాన్ మద్దతు
  • ఆ రెండు దేశాలకు భారతీయుల ఆగ్రహం
  • ఆ దేశాలకు తమ పర్యటనలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
  • మేక్‌మైట్రిప్, ఈజ్‌మైట్రిప్‌లో భారీగా క్యాన్సిలేషన్లు
  • టర్కీ, అజర్‌బైజాన్ పర్యాటక రంగానికి నష్టం
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను హతమార్చిన అమానుష ఘటన, అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మద్దతు పలికిన దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా, ఈ వివాదంలో పాకిస్థాన్‌కు వత్తాసు పలికిన టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాలపై భారత పర్యాటకులు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తిని చాటుతూ, వందలాది మంది భారతీయులు ఆ దేశాలకు ఇప్పటికే ఖరారైన తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారని ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సంస్థలు వెల్లడించాయి. 'ఆపరేషన్ సిందూర్' అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారతదేశంలోని అగ్రగామి ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ వేదికలైన 'మేక్‌మైట్రిప్' మరియు 'ఈజ్‌మైట్రిప్', భారత్‌కు వ్యతిరేకంగా నిలిచిన టర్కీ, అజర్‌బైజాన్‌లకు వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన క్షీణత నమోదైందని, పర్యటనల రద్దులు వెల్లువెత్తాయని అధికారికంగా ప్రకటించాయి.

మేక్‌మైట్రిప్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, "గత వారం రోజుల్లో అజర్‌బైజాన్, టర్కీలకు బుకింగ్‌లు 60 శాతం మేర తగ్గగా, క్యాన్సిలేషన్లు ఏకంగా 250 శాతం పెరిగాయి" అని తెలిపింది. తమ వెబ్‌సైట్‌లో ఈ దేశాలకు విమాన బుకింగ్‌లను పూర్తిగా నిలిపివేయనప్పటికీ, "దేశానికి సంఘీభావంగా, మన సాయుధ బలగాల పట్ల ప్రగాఢ గౌరవంతో, ఈ సెంటిమెంట్‌కు మేము గట్టిగా మద్దతు ఇస్తున్నాం. అజర్‌బైజాన్, టర్కీలకు అత్యవసరం కాని ప్రయాణాలను మానుకోవాలని సూచిస్తున్నాము. ఈ రెండు గమ్యస్థానాలకు పర్యాటకాన్ని నిరుత్సాహపరిచేందుకు మా ప్లాట్‌ఫామ్‌లో అన్ని ప్రమోషన్లు, ఆఫర్లను ఇప్పటికే నిలిపివేశాం" అని ఆ సంస్థ స్పష్టం చేసింది.

ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ మాట్లాడుతూ, తమ పోర్టల్‌లో టర్కీకి 22 శాతం, అజర్‌బైజాన్‌కు 30 శాతానికి పైగా పర్యటనలు రద్దయ్యాయని తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపిన ఈ దేశాలను సందర్శించడం మానుకోవాలని ఆయన భారత ప్రయాణికులను కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిట్టీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు. అయితే, అనేక మంది ప్రయాణికులు టర్కీని కేవలం లేఓవర్‌గా ఉపయోగిస్తున్నందున, అసౌకర్యాన్ని నివారించడానికి ఇప్పటికే ఉన్న బుకింగ్‌లను రద్దు చేయకూడదని తమ సంస్థ నిర్ణయించుకుందని ఆయన తెలిపారు.

భారత పర్యాటకుల ఈ నిర్ణయం టర్కీ, అజర్‌బైజాన్ ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా పర్యాటక రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అజర్‌బైజాన్ టూరిజం బోర్డు ప్రకారం, 2024లో ఆ దేశాన్ని 2,43,589 మంది భారతీయ పర్యాటకులు సందర్శించారు. టర్కీ సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2024లో ఆ దేశానికి 3,30,000 మంది భారతీయులు వెళ్లారు. 

2023లో టర్కీలో భారత పర్యాటకుల మొత్తం వ్యయం సుమారు $350-400 మిలియన్లు (దాదాపు రూ. 3,000 కోట్లు) ఉంటుందని అంచనా. టర్కీ జీడీపీలో పర్యాటక రంగం వాటా 12 శాతం కాగా, తాజా పరిణామాలతో ఈ దేశ పర్యాటక ఆదాయానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి.


More Telugu News