Bharatavastra: శత్రు డ్రోన్లకు చెక్!: 'భార్గవాస్త్ర' ప్రయోగం విజయవంతం

Bharatavastra Counter Drone System Successfully Tested

  • స్వదేశీ కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థ ‘భార్గవాస్త్ర’
  • సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్ అభివృద్ధి
  • ఒడిశాలో విజయవంతమైన పరీక్షలు
  • డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఛేదించనున్న భార్గవాస్త్ర

దేశ రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. శత్రు డ్రోన్ల సమూహాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'భార్గవాస్త్ర' కౌంటర్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్) ఈ అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.

ఒడిశాలోని గోపాల్‌పుర్‌ వద్ద గల సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ పరీక్షలు జరిగినట్లు ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ అధికారులు తెలిపారు. మొత్తం మూడు దశల్లో ట్రయల్స్‌ నిర్వహించగా, అన్నింటిలోనూ 'భార్గవాస్త్ర' తన లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్లు వెల్లడించారు. మొదటి రెండు పరీక్షల్లో ఒక్కో మైక్రో రాకెట్‌ను ప్రయోగించగా, మూడో విడతలో రెండు రాకెట్లను కేవలం రెండు సెకన్ల వ్యవధిలో ప్రయోగించి, డ్రోన్ల సమూహాన్ని విజయవంతంగా నిర్వీర్యం చేశారు.

2.4 కిలోమీటర్ల దూరం నుంచే శత్రు డ్రోన్లను గుర్తించే భార్గవాస్త్ర

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, డ్రోన్ల ద్వారా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను రూపొందించారు. 'భార్గవాస్త్ర' వ్యవస్థ శత్రు డ్రోన్లను సుమారు 2.5 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి, మైక్రో రాకెట్ల సాయంతో వాటిని కూల్చివేయగలదు. దీనిలోని శక్తివంతమైన రాడార్ వ్యవస్థ 6 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని గగనతల ముప్పులను పసిగట్టగలదు.

ఈ వ్యవస్థలో రెండు అంచెల రక్షణ ఉంటుంది. మొదటి అంచెలో అన్‌గైడెడ్‌ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి 20 మీటర్ల పరిధిలోని డ్రోన్ల గుంపును నాశనం చేస్తాయి. రెండో అంచెలో ఉండే గైడెడ్‌ మైక్రో క్షిపణులు నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తాయి. తక్కువ ఖర్చుతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 'భార్గవాస్త్ర' సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులోని పర్వత ప్రాంతాలు, కొండల ప్రదేశాల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఆత్మనిర్భర్ కార్యక్రమంలో దీన్ని కీలక పరిణామంగా భావిస్తున్నారు.

Bharatavastra
Counter Drone System
Solar Defence and Aerospace Limited
Indian Defence
Drone Defence
Anti-Drone Technology
  • Loading...

More Telugu News