BCCI: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్

- టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇద్దరికీ గ్రేడ్ A+ కాంట్రాక్ట్
- ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడి
- ఇప్పటికీ రోహిత్, కోహ్లీ భారత క్రికెట్‌లో భాగమేనన్న సైకియా
ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. వాళ్లు టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వాళ్ల A+ కాంట్రాక్ట్ కొనసాగుతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. వారు భారత క్రికెట్‌లో భాగమై ఉన్నారని, A+ సౌకర్యాలు గతంలో మాదిరే వారికి లభిస్తాయని పేర్కొన్నారు.
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకారం, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ... "టీ20, టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ A+ కాంట్రాక్ట్ కొనసాగుతుంది. వారు ఇప్పటికీ భారత క్రికెట్‌లో భాగమే. వారికి గ్రేడ్ A+ యొక్క అన్ని సౌకర్యాలు లభిస్తాయి" అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు.
కాగా, బీసీసీఐ రూల్స్ ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండే ఆటగాళ్లకు మాత్రమే గ్రేడ్ A+ కాంట్రాక్ట్‌లు ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే, 2024లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగారు. అలాగే ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికారు.
'రో-కో' (రోహిత్-కోహ్లీ) ప్రస్తుతం భారత జట్టు తరఫున బరిలోకి దిగే ఏకైక ఫార్మాట్ వన్డేలే. ఈ ద్వయం 2027 ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే వన్డే ఫార్మాట్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఎలాగైనా వచ్చే వన్డే వరల్డ్‌కప్ ఆడాలనేది వారి కోరిక. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు బోల్తాపడి ట్రోఫీని త్రుటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే.